Begin typing your search above and press return to search.

మేకప్‌మన్ కు కళ్యాణ్ రామ్ స్పెషల్ సర్‌ప్రైజ్

నందమూరి వారసుడు కాల్యాణ్ రామ్ తన ప్రొఫెషనల్ జీవితం కంటే కూడా వ్యక్తిత్వంతోనే అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   1 April 2025 9:23 AM IST
Kalyan Ram Visits Makeup Artist Family
X

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తన ప్రొఫెషనల్ జీవితం కంటే కూడా వ్యక్తిత్వంతోనే అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాడు. ఆయన మాట్లాడే విధానం, వ్యవహార శైలిలో ఎక్కడా డిస్టెన్స్ ఉండకుండా జనం మధ్య ఉండేలా చేస్తాడు. లేటెస్ట్ గా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ప్రాంతంలో జరిగిన ఓ సర్‌ప్రైజ్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. తన కొత్త సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నుంచి ఓ పాటను ప్రమోట్ చేయడానికి అక్కడికి వెళ్లిన సందర్భంగా,కళ్యాణ్ రామ్ తన పర్సనల్ మేకప్‌మన్ కుటుంబాన్ని సర్‌ప్రైజ్ చేశాడు.

ఇటీవల కళ్యాణ్ రామ్ తన పర్సనల్ మేకప్‌మన్ వెంకటేష్ నివాసానికి వెళ్లి, అతని కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. వెంకటేష్ గత 12 ఏళ్లుగా కాల్యాణ్ రామ్‌కు వర్క్ చేస్తున్న వ్యక్తి. వారి మధ్య ఉన్న బంధం కేవలం ఉద్యోగ సంబంధం కాదు, కుటుంబ బంధంలా మారింది. ఈ అనుబంధానికి గుర్తుగా, కాల్యాణ్ రామ్ తన సమయాన్ని కేటాయించి వెంకటేష్ కుటుంబాన్ని కలవడం, వారికి సంతృప్తిని ఇచ్చేలా ఆత్మీయత చూపించడం అభినందనీయమైన విషయం.

ఈ సందర్బంగా వెంకటేష్ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఒక స్టార్ హీరో, తన సహాయకుడి ఇంటికి వచ్చి మాట్లాడటం, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా గౌరవించడం అన్నది సింపుల్ విషయంగా కనిపించినా, దీని వెనుక ఉన్న విలువే వేరు. ఇటువంటి ప్రేమలే ఒక హీరోకి ఫ్యాన్స్‌తోపాటు తన వర్కింగ్ టీంలో కూడా గుర్తింపు తెస్తాయి. ఇది కేవలం ఒక మేకప్‌మన్ కుటుంబానికే కాదు, పరిశ్రమలో పనిచేస్తున్న వారందరికీ ఓ మెసేజ్ లాంటిదే.

ఇక తన నెక్స్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్‌లో భాగంగా కాల్యాణ్ రామ్ ఇటీవలే చాలా యాక్టివ్‌గా మారాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అశోకా క్రియేషన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, కథ, మేకింగ్ విషయంలో ఇది ఆయనకు మరో మంచి హిట్ అవుతుందని సినీ వర్గాల్లో మంచి టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ పాట ప్రమోషన్ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి.