Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD: 600 కోట్ల బడ్జెట్‌లో VFX ఖ‌ర్చు ఎంత‌?

మొత్తం బ‌డ్జెట్ లో 38శాతం ఖర్చు పూర్తిగా విజువ‌ల్ గ్రాఫిక్స్ కోస‌మే కేటాయించ‌డంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:42 AM GMT

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న 'కల్కి 2898 AD' భార‌త‌దేశంలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమాల‌లో ఒక‌టి. ఈ చిత్రానికి వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ 600కోట్ల బ‌డ్జెట్ వెచ్చించార‌ని క‌థ‌నాలొచ్చాయి. రెండు భాగాలుగా రూపొంద‌నున్న ఈ చిత్రం బాహుబలి- సాహో -ఆదిపురుష్ ల‌ను మించే బిగ్గెస్ట్ కాన్వాస్ ఉన్న‌ది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ ప్ర‌జ‌ల్లో భారీ అంచ‌నాల్ని పెంచింది.

ఈ సినిమా మొత్తం బ‌డ్జెట్ లో VFX కోసం 230 కోట్లు ఖర్చు చేస్తున్నారనేది తాజా చ‌ర్చ‌. మొత్తం బ‌డ్జెట్ లో 38శాతం ఖర్చు పూర్తిగా విజువ‌ల్ గ్రాఫిక్స్ కోస‌మే కేటాయించ‌డంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ వంటి డిజాస్టర్‌పై VFX- CGI కోసం 200 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని అంచ‌నా ఉంది. కానీ ఈ సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ కే కోసం అంత భారీ మొత్తాన్ని కేవ‌లం గ్రాఫిక్స్ కోస‌మే ఖర్చు చేయ‌డం స‌రైన‌దేనా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ నెటిజ‌నుల్లో సాగుతోంది.

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావచ్చని, CGIపై 230 కోట్లు జస్టిఫై అవుతాయని ఒక సెక్ష‌న్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా 2024 జనవరి 12న విడుద‌ల‌వుతుంది. ఇంత‌కుముందు చిత్ర‌బృందం ఈ తేదీని ప్ర‌క‌టించినా కానీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్‌లో ఉన్నందున మే 9న విడుదలవుతుంద‌న్న పుకారు ఉంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి భారీ తారాగణం న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ వ‌ర్సెస్ క‌మ‌ల్ హాస‌న్ ఫేసాఫ్ సినిమాని మ‌రో స్థాయికి చేర్చుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో పూర్తి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న తొలి భార‌తీయ చిత్ర‌మిద‌ని ప్ర‌చారం ఉంది.

ఇది చాలా ప్ర‌త్యేక‌త ఉన్న సినిమా:

కల్కి 2898 AD చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే దిగ్గ‌జాల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రొటీన్ కి భిన్నంగా పూర్తిగా అధునాత‌న సాంకేతిక‌త‌ను స‌ద్వినియోగం చేస్తూ అసాధార‌ణంగా రూపొందిస్తున్నార‌ని, ఇత‌రుల ఊహ‌కు అంద‌నంత భిన్న‌మైన చిత్ర‌మిద‌ని ఇంతకుముందు ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న దీపిక ప‌దుకొనే వ్యాఖ్యానించింది. అలాగే బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న పాత్ర చిత్ర‌ణ స‌మ‌యంలో ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్న భారీ కాన్వాస్ అసాధార‌ణంగా ఉంద‌ని విజువ‌ల్ వండ‌ర్ అవుతుంద‌ని ప్ర‌శంసించారు. ఇంత‌కుముందు టీజ‌ర్ విడుద‌ల కాగానే క‌ల్కి చిత్రంపై ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. క‌ల్కి- టీమ్ అనుకున్న‌ది సాధించింద‌ని రాజ‌మౌళి కీర్తించారు.

టీజ‌ర్ పై ద‌ర్శ‌క‌ధీరుడి ట్వీట్ సారాంశం ఇలా ఉంది. "ఇది చాలా కష్టత‌ర‌మైనది అయినా కానీ ప్రామాణికమైన ఫ్యూచ‌ర్ చిత్రాన్ని రూపొందించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ - నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కి అభినంద‌న‌లు. అబ్బాయిలూ మీరు దీన్ని సాధ్యం చేసారు.. డార్లింగ్ స్మాషింగ్" అని రాజమౌళి ట్వీట్ చేశారు. చివ‌రిగా 'ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది...విడుదల తేదీ ఎప్పుడు?" అంటూ రాజ‌మౌళి ప్ర‌శ్నించారు. దీనికి త్వ‌ర‌లోనే క‌ల్కి టీమ్ స్ప‌ష్ఠ‌తనిస్తుందేమో చూడాలి.