Begin typing your search above and press return to search.

కల్కి పూర్తవ్వడానికి ఎంత టైమ్ పట్టిందంటే!

అయితే ఎన్నికల హడావిడి కారణంగా మే చివరలో లేదా జులైలో రిలీజ్ కి సిద్ధం అవుతున్నారు.

By:  Tupaki Desk   |   11 April 2024 4:52 AM GMT
కల్కి పూర్తవ్వడానికి ఎంత టైమ్ పట్టిందంటే!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ మూవీని అశ్వినీ దత్, స్వప్నా దత్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మేలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది.

అయితే ఎన్నికల హడావిడి కారణంగా మే చివరలో లేదా జులైలో రిలీజ్ కి సిద్ధం అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇంగ్లీష్ లో కూడా మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. హైటెక్నాలజీ స్టాండర్డ్స్ తో ఓ కొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం కోసం నాగ్ అశ్విన్ సృష్టించాడు. ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.

అమితాబచ్చన్ ఈ మూవీలో అశ్వద్ధామ పాత్రలో కనిపిస్తాడంట. అలాగే పరశురామ్, హనుమాన్ పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది. కమల్ హాసన్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. భారీతారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణంగా ఇండియన్ మైథాలజీ రిఫరెన్స్ తో చేస్తోన్న మూవీ కావడమే.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కి చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసిందంట. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న కల్కి పార్ట్ 1కి బుధవారం గుమ్మడికాయ కొట్టేసినట్లు తెలుస్తోంది. 2021 జులై 24న కల్కి సినిమా షూటింగ్ నాగ్ అశ్విన్ స్టార్ట్ చేశారు. సుమారు మూడేళ్ళ పాటు కొనసాగిన మూవీ షూటింగ్ ఎట్టకేలకి ముగిసింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్, బిజినెస్ పై చిత్ర యూనిట్ ఫోకస్ చేయనుంది.

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలతో కల్కి 2898ఏడీని పోల్చి చూస్తున్నారు. క్వాలిటీ పరంగా ఏ మాత్రం తేడా ఉన్నా ట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకే నాగ్ అశ్విన్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.

ఇక నిర్మాత అశ్వినీ దత్ బిజినెస్ వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాలలో డీల్స్ సెట్ అయ్యాయి. నైజాంలో సాలీడ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మలయాళం భాషకు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ కావాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను సినిమా బిజినెస్ ద్వారానే మినిమమ్ పెట్టుబడులు వెనక్కి తెచ్చుకునేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.