Begin typing your search above and press return to search.

'కల్కి 2898 AD'.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్?

హిందూ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం 'కల్కి 2898 AD'.

By:  Tupaki Desk   |   15 March 2024 3:30 PM GMT
కల్కి 2898 AD.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్?
X

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కల్కి 2898 AD". మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల దగ్గర పడుతున్నా ఇంకా సెట్స్ మీదే ఉండటం, ప్రమోషన్స్ షురూ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

హిందూ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం 'కల్కి 2898 AD'. ఇది ఇండియన్ సినిమాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి తగ్గట్టుగానే శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌ లో ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను రిలీజ్ చేసి గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించారు.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే ప్రతీ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అందులోనూ 'కల్కి 2898 AD' అనేది ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ కావడంతో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. 'సలార్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కచ్ఛితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని, RRR & KGF చిత్రాల రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు రిలీజ్ కు 8 వారాలు మాత్రమే ఉన్నా, ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. సోషియో ఫాంటసీ జోనర్ సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

మామూలుగా ఇలాంటి భారీ చిత్రాలు విడుదలకు మూడు నెలల ముందుగానే షూటింగ్ పూర్తి చేసి, రెండు నెలలు ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్తుంటారు. ఎస్ఎస్ రాజమౌళి ప్రతీ సినిమాకు ఇదే ఫాలో అవుతుంటారు. సినిమా కోసం ఎంతగా కష్టపడతారో, ప్రమోషన్స్ కు అంతే ప్రాధాన్యతనిస్తారు. 'కల్కి'ని ఇంటర్నేషనల్ లెవల్ లో తీసుకెళ్లాలంటే ఇంకాస్త గట్టిగానే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ప్రమోషన్స్ సంగతి పక్కన పెడితే, ఇంకా షూటింగే కంప్లీట్ అవ్వలేదు.

ఇటీవలే 'కల్కి 2898 AD' లోని ఓ పాటను ఇటలీలో షూట్ చేశారు. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ కూడా చిత్రీకరణ పూర్తి చేశారు. బిగ్ బి తన బ్లాగ్‌లో ఈ అప్‌డేట్ పోస్ట్ చేస్తూ.. మే 9న సినిమాను విడుదల చేయనున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇంకా కొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉండటం వల్ల, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ రెడీ అవుతుందో లేదో అని డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ వర్గాలు సందిగ్ధంలో ఉన్నారని టాక్ నడుస్తోంది.

'కల్కి 2898 AD' సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ భామలు దీపికా పడుకునే, దిశా పటాని నటిస్తున్నారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటుగా విశ్వ నటుడు కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నార. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 'తుంబాడ్' ఫేమ్ నితిన్ జిహాని చౌదరి ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.