Begin typing your search above and press return to search.

భారతదేశంలోనే అత్యంత సంపన్న నిర్మాత

భారతదేశంలో అత్యంత సంపన్న నిర్మాత ఎవరు? అంటే.. క‌చ్ఛితంగా అది 'సన్ పిక్చర్స్' యజమాని కళానిధి మారన్.

By:  Tupaki Desk   |   14 March 2024 2:30 PM GMT
భారతదేశంలోనే అత్యంత సంపన్న నిర్మాత
X

భార‌త‌దేశంలో అత్యంత సంప‌న్న నిర్మాత ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం అంత సులువేమీ కాదు. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, అమీర్ ఖాన్, గౌరీ ఖాన్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సురేష్ బాబు, గీతా ఆర్ట్స్ అల్లు అర‌వింద్, డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ దాన‌య్య‌..ఆర్కా మీడియా శోభు, హోంబ‌లే ఫిలింస్ కిరంగ‌దూర్.. వీళ్లెవ‌రూ కానే కాదు! 59 ఏళ్ల ఈ నిర్మాత ఇటీవల సౌత్ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. అత‌డు ఎవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా?

ఒక సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ హిట్ అయినప్పుడు అందులో న‌టించిన హీరో గురించి దర్శకుడి గురించి మాత్ర‌మే మాట్లాడుకుంటారు. కానీ తెరవెనుక నిర్మాత‌ను ఎవ‌రూ గుర్తుంచుకోరు. సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి పూర్తి అయ్యే వరకు మొత్తం ప్రాజెక్ట్‌కు వెన్నెముకగా ఉండే నిర్మాతకు నేడు ఉన్న గుర్తింపు అది. సినిమా నిర్మాత‌ తమ సినిమాల్లోని స్టార్ల లాగా విపరీతమైన ప్రజాదరణ పొందకపోవచ్చు.. కానీ వారి భారీ సంపద వారి విజయాల‌ గురించి మాట్లాడుతుంది. కరణ్ జోహార్ లేదా ఆదిత్య చోప్రా అత్యంత ధనవంతులైన భారతీయ నిర్మాతలు అని ఎవరైనా అనుకోవచ్చు. సుదీర్ఘ కాలం ఈ రంగంలో ఉండ‌డం వ‌ల్ల ఏవో కొన్ని పేర్లు మాత్ర‌మే త‌ల‌పున‌కు వ‌స్తాయి.

భారతదేశంలో అత్యంత సంపన్న నిర్మాత ఎవరు? అంటే.. క‌చ్ఛితంగా అది 'సన్ పిక్చర్స్' యజమాని కళానిధి మారన్. అత‌డు అత్యంత ధనిక భారతీయ చలనచిత్ర నిర్మాత. 2022లో 59 ఏళ్ల వ్యాపారవేత్త నికర ఆస్తుల విలువ 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 19,000 కోట్లు)గా ఉందని ఫోర్బ్స్ వెల్ల‌డించింది.

కళానిధి మారన్ అత‌డి భార్య కావేరి కళానిధి జీతం సంవత్సరానికి రూ. 87.50 కోట్లు అని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఇది 2017-2018 నుండి అలాగే ఉంది. ఇది వారిని భారతదేశంలో అత్యధికంగా అందుకునే ఎగ్జిక్యూటివ్‌లుగా రికార్డుల‌కెక్కించింది. రిల‌య‌న్స్ అధినేత‌ ముఖేష్ అంబానీ ఏడాది జీతం రూ. 15 కోట్లుగా ఉండ‌గా, దీనికంటే నాలుగు రెట్లు అధికంగా అందుకున్న ఎగ్జిక్యూటివ్ క‌ళానిధి మార‌న్.

కళానిధి మారన్ తర్వాత రోనీ స్క్రూవాలా నంబర్ 2 స్థానంలో ఉన్నారు. అతడు అంతకుముందు రెండవ అత్యంత సంపన్న భారతీయ చలనచిత్ర నిర్మాత. రోనీ స్క్రూవాలా నికర ఆస్తుల విలువ రూ.12,800 కోట్లు. నం. 3 మరియు నం. 4 స్థానాల్లో ఆదిత్య చోప్రా (సుమారు రూ. 7,500 కోట్ల నికర ఆస్తులు).. ఈరోస్ అర్జన్- కిషోర్ లుల్లా ఉన్నారు. వీరి ఉమ్మడి నికర ఆస్తుల‌ విలువ రూ. 7,400 కోట్లు.

కరణ్ జోహార్, గౌరీ ఖాన్ వరుసగా నం. 5. నం. 6 స్థానంలో ఉన్నారు. క‌ర‌ణ్ జోహార్ అంచనా నికర ఆస్తుల‌ విలువ రూ. 1,700 కోట్లు కాగా గౌరీ ఖాన్ నికర ఆస్తుల‌ విలువ రూ. 1,600 కోట్లు. అమీర్ ఖాన్ నిర్మాత‌గా 1,500 కోట్ల రూపాయల నికర ఆస్తుల విలువతో 7వ స్థానంలో ఉన్నారు. జాబితాలో రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన వారిలో సాజిద్ నదియాడ్‌వాలా, భూషణ్ కుమార్, ఏక్తా కపూర్ ఉన్నారు.

జైలర్ ఘ‌న‌విజయం

కళానిధి మారన్ నిర్మించిన జైల‌ర్ గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రజనీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ జైలర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిల‌వ‌డ‌మే గాక సుమారు 600 కోట్లు వ‌సూలు చేసింది. జైలర్ విజయానికి కృతజ్ఞతగా కళానిధి మారన్ రజనీకాంత్‌కు భారీ చెక్కును అందించడమే కాకుండా సూపర్ స్టార్‌కి BMW X7 కారును బహుమతిగా కూడా ఇచ్చారు.

కళానిధి మారన్ తదుపరి ధనుష్ నటిస్తున్న రాయ‌న్ ( D50)ని నిర్మిస్తున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత అయిన ద‌నుష్ కి కెరీర్ 50వ చిత్రం కాబ‌ట్టి భారీ అంచ‌నాలున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించడంతోపాటు కథను కూడా అందిస్తున్నారు. D50లో నిత్యా మీనన్, S. J. సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ కూడా నటిస్తున్నారు.