ట్రైలర్ టాక్: ఆడపిల్లలను మింగేసే మర్రిచెట్టు రహస్యాలు
ట్రైలర్ నిజంగా బాగుంది .. ఇది 100శాతం ఒరిజినల్‌గా కనిపిస్తోంది కాబట్టి, ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది.
By: Tupaki Desk | 30 May 2025 6:00 AM ISTఇటీవలి కాలంలో హారర్ కథల్ని వర్కవుట్ చేయడంలో చాలా మంది దర్శకులు సక్సెసవుతున్నారు. కాంచన ఫ్రాంఛైజీతో రాఘవ లారెన్స్ పెద్ద సక్సెసయ్యాడు. అటు స్త్రీ ఫ్రాంఛైజీని విజయవంతంగా నడిపిస్తూ మడాక్ ఫిలింస్ కూడా వందల కోట్లు ఆర్జిస్తోంది. కేవలం హారర్ లో థ్రిల్లిచ్చే కంటెంట్ ని అందించడంలో ప్రతిభతో ఇది సాధ్యమవుతోంది.
ఇంతకుముందు అజయ్ దేవగన్, మాధవన్ షైతాన్ లాంటి థ్రిల్లింగ్ చిత్రంలో నటించగా అది బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. భూత ప్రేతాలు, ఆత్మల కారణంగా, మంత్ర తంత్రాల ప్రపంచంలో తన కూతురి కష్టం చూసి చలించిపోయేవాడిగా దేవగన్ నటించాడు. ఇప్పుడు అతడి సతీమణి కాజోల్ ఇదే తరహాలో తన కుమార్తె కష్టం చూడలేని మాంత్రిక ప్రపంచంలో రాక్షస ప్రేతాల కథలో కనిపించింది.
చందన్ పూర్ గ్రామానికి సమీపంలో జరిగిన కథగా దీనిని చూపించారు. భయానక మర్రిచెట్టు ఎందరో ఆడపిల్లలను సంహరించిన ఘటన వెనక మిస్టరీ ఏమిటన్నది ఉత్కంఠను పెంచింది. ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో విస్తరించిన పెద్ద మర్రిచెట్టు, ఆ చెట్టు తొర్ర, మర్రిచెట్టు ఊడల భయానక రాక్షస విన్యాసాలను తాజాగా రిలీజైన `మా` ట్రైలర్ లో చూపించారు. కార్ లో తన కుమార్తెతో కలిసి దట్టమైన కీకారణ్యంలో వెళుతున్న కాజోల్ జీవితంలో ఎలాంటి పెను మార్పులు సంభవించాయి? తన కూతురికి ఏమైంది? అసలు ఆ అరణ్యంలో ఆ మర్రిచెట్టు కథేమిటి? దానివెనక దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, రాక్షసుల కథేమిటన్నదే ఈ సినిమా. మర్డర్ మిస్టరీతో ముడిపడిన, క్రైమ్ థ్రిల్లర్ జానర్ కి హారర్ టచ్ ఇచ్చి తెరకెక్కించారని అర్థమవుతోంది. ట్రైలర్ ఆద్యంతం దడ పుట్టించే విజువల్స్ తో అద్భుతంగా కనిపిస్తోంది. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఇందులో ఉన్నాయని కూడా ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది.
ట్రైలర్ నిజంగా బాగుంది .. ఇది 100శాతం ఒరిజినల్‌గా కనిపిస్తోంది కాబట్టి, ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. బాలీవుడ్ కొత్త విషయాలను ప్రయత్నిస్తున్నందుకు సంతోషంగా ఉందని నెటిజనులు స్పందిస్తున్నారు.
మా చిత్రంలో ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఖేరిన్ శర్మ, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిల్మ్స్ మద్దతుతో దీనిని అజయ్ దేవ్‌గన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. కుమార్ మంగత్ పాఠక్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి హర్ష్ ఉపాధ్యాయ్, రాకీ ఖన్నా, శివ్ మల్హోత్రా సంగీతం సమకూర్చారు.
