వీరమల్లు వసూళ్లను అందుకే రివీల్ చేయట్లేదు: డైరెక్టర్
అయితే వీరమల్లు మూవీ వసూళ్లను ఇప్పటి వరకు మేకర్స్ వెల్లడించలేదు.
By: Tupaki Desk | 27 July 2025 5:46 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్లపాటు సెట్స్ పై ఉండిపోయిన ఆ సినిమా.. ఎట్టకేలకు ఇటీవల రిలీజ్ అయింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిన చిత్రం.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది.
క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించగా.. దయాకర్ రావు నిర్మించారు.
అయితే వీరమల్లు మూవీ వసూళ్లను ఇప్పటి వరకు మేకర్స్ వెల్లడించలేదు. 23వ తేదీ ప్రీమియర్స్ పడగా.. 24వ తేదీన సినిమా గ్రాండ్ గా విడుదల అయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కలెక్షన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సాధారణంగా ఏ మూవీ అయినా మేకర్స్ వసూళ్లను అనౌన్స్ చేస్తున్నా.. వీరమల్లు వాళ్లు మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
దీనిపై ఇప్పుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ రెస్పాండ్ అయ్యారు. తాము నిజాయతీగా కలెక్షన్స్ గురించి అనౌన్స్ చేసినా.. అది తప్పో ఒప్పో అని చాలామంది డిస్కస్ చేస్తుంటారని అన్నారు. అంతే కాదు కామెంట్స్ కూడా చేస్తుంటారని తెలిపారు. ముఖ్యంగా సినిమా కలెక్షన్స్ గురించి ఎప్పుడూ బయట టాక్ వస్తూనే ఉంటుందని చెప్పారు.
వార్తలు కూడా వస్తూనే ఉంటాయని, అందుకే ఒకప్పటి ఫార్ములాను ఫాలో అవుతున్నామని జ్యోతి కృష్ణ వెల్లడించారు. సక్సెస్ ఫుల్ గా మూవీ ప్రదర్శితమవుతందని చెబుతున్నట్లు తెలిపారు. వసూళ్లకు సంబంధించి ప్రస్తుతానికి తమ నుంచి ఎలాంటి పోస్టర్ కూడా విడుదల చేయలేదని డైరెక్టర్ స్పష్టం చేశారు.
కాగా.. మూడు రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా ఇండియాలో రూ.66 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ఊహించినట్లు సమాచారం. మరి ఓవరాల్ గా వీరమల్లు చిత్రం ఎంత వసూలు చేస్తుందో.. మేకర్స్ ఏమైనా అఫీషియల్ గా ప్రకటిస్తారో లేదో వేచి చూడాలి.
