Begin typing your search above and press return to search.

వైరల్ వయ్యారి సాంగ్: కిరీటితో శ్రీలీల మాస్ వైబ్!

ఈ పాటలో శ్రీలీల గ్లామర్‌, డాన్సులే హైలైట్. యూత్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఆమె మాస్ లుక్‌లో మెరిసింది. మరోవైపు కొత్త హీరో కిరీటి కూడా తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   4 July 2025 7:11 PM IST
వైరల్ వయ్యారి సాంగ్: కిరీటితో శ్రీలీల మాస్ వైబ్!
X

వారాహి చలనచిత్రం బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘జూనియర్’ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతుండటంతో సినిమా చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది. రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజని కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 18న సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. దీంతో మేకర్స్ ప్రొమోషన్ల స్పీడ్ పెంచారు.

ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరింతగా సినిమా హైప్ పెంచేందుకు మేకర్స్ రెండవ పాట ‘వైరల్ వయ్యారి’ని విడుదల చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాప్ స్టైల్, యూత్ ఫుల్ లిరిక్స్‌తో పాట పూర్తిగా ట్రెండీగా ఉంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు హరిప్రియ కలిసి పాడారు.

ఈ పాటలో శ్రీలీల గ్లామర్‌, డాన్సులే హైలైట్. యూత్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఆమె మాస్ లుక్‌లో మెరిసింది. మరోవైపు కొత్త హీరో కిరీటి కూడా తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. శ్రీలీల స్థాయికి తగినట్టు స్టెప్స్ వేసి పర్ఫార్మ్ చేయడం చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కిరీటి డ్యాన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి.

లిరిక్స్ విషయానికొస్తే కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా స్లాంగ్, ట్రెండీ పదాలతో కలిపి రాసిన విధానం యూత్‌లో మంచి కనెక్ట్ కలిగిస్తోంది. కేవలం పాటే కాదు, డాన్స్ స్టైల్, లొకేషన్స్ అన్నీ కలిపి ఈ పాటను యూజర్స్ ఎప్పుడో టాప్ చార్ట్‌లో ఉంచేశారు. కేకే సెంతిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కలర్ ఫుల్ విజువల్స్ పాటకు స్పెషల్ ఫీల్‌ను ఇచ్చాయి.

ఇక సినిమాలో శ్రీలీలతో పాటు జెనీలియా ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ పార్ట్‌కు పీటర్ హైన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తుండటమే కాకుండా.. టెక్నికల్ టాప్ టాలెంట్‌తో రూపొందిస్తున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.