Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జూనియర్

తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వచ్చాడు. తెలుగు మూలాలున్న కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దనరెడ్డి తనయుడైన కిరీటి 'జూనియర్’ సినిమాతో ఒకేసారి అటు కన్నడలో.. ఇటు తెలుగులో హీరోగా అరంగేట్రం చేశాడు.

By:  Tupaki Desk   |   18 July 2025 1:36 PM IST
Junior Movie Review
X

'జూనియర్’ మూవీ రివ్యూ

నటీనటులు: కిరీటి- శ్రీలీల- జెనీలియా- రవిచంద్రన్- రావు రమేష్- అచ్యుత్ కుమార్- హర్ష చెముడు తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్

మాటలు: కళ్యాణ చక్రవర్తి

నిర్మాత: సాయి కొర్రపాటి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాధాకృష్ణ రెడ్డి

తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వచ్చాడు. తెలుగు మూలాలున్న కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దనరెడ్డి తనయుడైన కిరీటి 'జూనియర్’ సినిమాతో ఒకేసారి అటు కన్నడలో.. ఇటు తెలుగులో హీరోగా అరంగేట్రం చేశాడు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ప్రొడక్షన్లో రాధాకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అభి (కిరీటి).. నడి వయస్సులో ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన సంతానం. అతను పుట్టగానే తల్లి చనిపోతుంది. తండ్రి అతణ్ని కళ్లలో పెట్టుకుని పెంచుతాడు. కానీ తండ్రి అతి ప్రేమ కొడుక్కి భారంగా మారుతుంది. తాను కోరుకున్నట్లుగా బాల్యాన్ని గడపలేకపోయిన అభి.. కాలేజీలో సరికొత్తగా జ్ఞాపకాలను పోగేసుకుంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. అభి-స్ఫూర్తి కలిసి ఒక ప్రాజెక్ట్ చేసి.. దాని ద్వారాానే ఒక సంస్థలో ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ అక్కడ చేరిన మొదటి రోజే సంస్థ యజమాని విజయ (జెనీలియా) ఆగ్రహానికి గురవుతాడు అభి. ఆ కంపెనీని అభి వదిలి వెళ్లిపోవాల్సిన సమయంలోనే అతడికో షాకింగ్ విషయం తెలుస్తుంది.. అదేంటి.. తర్వాత తన జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఓ సినిమాపై మంచి బడ్జెట్ పెట్టి ఒక కొత్త హీరోను లాంచ్ చేస్తున్నారు అంటే.. ప్రధానంగా ఫోకస్ చేసేది తన ప్రతిభా పాటవాలను చాటడం మీదే. తెరపై చలాకీగా కనిపించి.. డ్యాన్సులు- ఫైట్లలో నైపుణ్యం చూపించి.. నటనలో నాట్ బ్యాడ్ అనిపిస్తే ఆ సినిమా లక్ష్యం నెరవేరినట్లే. ఇక్కడి వరకు అయితే 'జూనియర్’ సక్సెస్ అయినట్లే. మన సినీ కుటుంబాలకు చెందిన కుర్రాడు కాకపోయినా.. కిరీటి చూడగానే నచ్చేస్తాడు. ఎక్కువ బిల్డప్ లేకుండా.. ఏమాత్రం అతి చేయకుండా.. 'జూనియర్’లో అన్ని రకాలుగా తన టాలెంట్స్ చూపించడానికి మంచి ప్రయత్నమే చేశాడు కిరీటి. ఒక కొత్త హీరో నుంచి ఇంత గొప్ప డ్యాన్స్ ఈ మధ్య కాలంలో చూసి ఉండం అంటే అతిశయోక్తి కాదు. ఇక లైవ్ వైర్ లా కదులుతూ అతను చేసిన యాక్షన్ సీక్వెన్సులు కూడా అదిరిపోయాయి. నటన సూపర్ అని చెప్పలేం కానీ.. ఉన్నంతలో అన్ని ఎమోషన్లనూ బాగానే పలికించాడు. కానీ వీటన్నింటికీ ఓ మంచి కథ కూడా తోడై.. సినిమా కూడా ఆసక్తికరంగా సాగి ఉంటే 'జూనియర్’ కిరీటికి డ్రీమ్ డెబ్యూ అయ్యేది. కానీ ఆ అంశాల్లో ఈ చిత్రానికి మైనస్ మార్కులే పడతాయి. సాధారణంగా సాగే 'జూనియర్’ కథలో కిరీటి మెరుపులే సినిమాకు హైలైట్.

'జూనియర్’ తీసింది కన్నడ దర్శకుడు. ఈ చిత్రంతో పరిచయం అయింది తెలుగు మూలాలున్న కన్నడ కుర్రాడు. కానీ సినిమా చూస్తుంటే 'కన్నడ’ ఫీలింగ్ రవ్వంతైనా కలగదు. కథాకథనాల్లో కమర్షియల్ తెలుగు సినిమాల ఫార్మాట్ నే ఫాలో అయిపోయారు. ఇక్కడ ఒక హీరోను లాంచ్ చేసేటపుడు అతణ్ని హైలైట్ చేస్తూ ఎలా కథను నడిపిస్తారో అలాగే నడిపించారు. మన సినిమాలనే అటు ఇటు తిప్పి కథను వండారు. ఒక ప్రత్యేకమైన లక్షణమున్న కుర్రాడిగా హీరో పరిచయం.. కాలేజీలో ఒక బ్యాచ్ వేసుకుని అల్లరి చేయడం.. కథానాయికతో పరిచయం.. తనతో లవ్ ట్రాక్.. ఇలా తొలి గంటను సరదాగా అలా అలా నడిపించేసి.. ఆ తర్వాత ఒక ట్విస్టుతో కథకు ఎమోషనల్ టచ్ ఇచ్చి.. హీరోకు ఒక సమస్యలో పడేసి.. దాన్ని పరిష్కరించడం మీద ద్వితీయార్ధాన్ని లాగించడం.. ఇలా చాలా తెలుగు సినిమాలను గుర్తు చేసేలా సాగుతుంది 'జూనియర్’. కానీ ఇటు ప్రథమార్ధంలో కాలేజీ ట్రాక్ కానీ.. అటు ద్వితీయార్ధంలో పల్లెటూరి ఎపిసోడ్లు కానీ ఏమంత గొప్పగా అనిపించవు. కామెడీ.. రొమాన్స్.. ఎమోషన్లు.. అన్నీ సాధారణమే. కానీ హీరో మాత్రం ఎక్కడిక్కడ తన టాలెంట్ చూపిస్తుంటాడు. అతనే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటాడు.

అనుకోని పరిస్థితుల్లో దూరమైన తండ్రీ కూతుళ్లను కలపడానికి ఒక కొడుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా. 'అత్తారింటికి దారేది’ని గుర్తు చేసే ఈ పాయింట్ చుట్టూ నడిపిన ఎమోషనల్ డ్రామా సరిగా పండలేదు. తండ్రి-కూతురు విడిపోవడానికి దారితీసిన కారణం బలంగా కనిపించదు. కథలో మలుపు కోసం బలవంతంగా వాళ్లను విడదీసినట్లు అనిపిస్తుంది. అందుకే ప్రేక్షకులు ఈ పాయింట్ విషయంలో ఎమోషనల్ అవ్వడానికి అవకాశం లేకపోయింది. వాళ్లు కలవాలని బలంగా కోరుకోనపుడు... కలిసినపుడు భావోద్వేగాలు పండవు. ద్వితీయార్ధంలో 'మహర్షి’ సహా పలు చిత్రాలను తలపించేలా సాగే విలేజ్ ఎపిసోడ్లు కూడా అంతంతమాత్రంగా అనిపిస్తాయి. వీటితో పోలిస్తే ప్రథమార్ధంలో కాలేజ్ సీన్లే కొంచెం నయం అనిపిస్తాయి. రొమాంటిక్ ట్రాక్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. అది పాటలకు మాత్రమే ఉపయోగపడింది. కథలో కీలక మలుపు దగ్గర 'జూనియర్’ ఎంగేజ్ చేస్తుంది. కానీ ఆ ట్విస్టు తర్వాత రొటీన్ ట్రాక్ ఎక్కేస్తుంది. దర్శకుడు ముగింపులో మళ్లీ చిన్న ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టాడు కానీ.. దాని వల్ల సినిమా గ్రాఫ్ అయితే పెరగదు. ఓవరాల్ గా చెప్పాలంటే మేకర్స్ కోరుకున్నట్లు కొత్త హీరో ఇందులో బాగానే హైలైట్ అయ్యాడు కానీ.. సినిమాగా మాత్రం 'జూనియర్’కు బిలో యావరేజ్ మార్కులే పడతాయి.

నటీనటులు:

కిరీటి మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడే. తొలి సినిమాలో తన టాలెంట్స్ అన్నీ చూపించేశాడు. తనకు జూనియర్ ఎన్టీఆర్‌ అంటే ఎంత అభిమానమో ప్రమోషన్లలో బలంగా చెప్పిన కిరీటి.. తెర మీద తన ఆరాధ్య నటుడిని గుర్తు చేసేలా అద్భుతమైన డ్యాన్సులతో అలరించాడు. 'వైరల్ వయ్యారి’ పాటలో అయితే తారక్ మరో వెర్షన్ ను చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఫైట్లలో కూడా అతను చూపించిన చురుకుదనం ఆకట్టుకుంటుంది. కిరీటి నటనలోనూ పాస్ మార్కులే వేయించుకున్నాడు. కొత్తవాడైనా తడబడకుండా నటించాడు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. శ్రీలీల కేవలం పాటల కోసమే సినిమాలో ఉంది. తన నుంచి ఆశించే అదిరిపోయే డ్యాన్సులతో ఆకట్టుకుంది. ద్వితీయార్ధంలో ఆమె పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. 13 ఏళ్ల తర్వాత సౌత్ సినిమాలో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియాకు కీలకమైన పాత్రే దక్కింది కానీ.. మూడీగా సాగే ఆ క్యారెక్టర్ ఆమె అభిమానులకు అంతగా రుచించకపోవచ్చు. తన పెర్ఫామెన్స్ జస్ట్ ఓకే అనిపిస్తుందంతే. హీరో తండ్రి పాత్రలో రవిచంద్రన్ ఆకట్టుకున్నాడు. రావు రమేష్ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. విలన్ల పాత్రలు చాలా వీక్. అచ్యుత్ కుమార్.. మరో కొత్త నటుడు సాదాసీదాగా అనిపిస్తారు. హీరో స్నేహితులుగా వైవా హర్ష.. మిగతా ఆర్టిస్టులు పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

'జూనియర్’కు దేవిశ్రీ ప్రసాద్.. సెంథిల్ కుమార్ లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేశారు. వాళ్లు సినిమాకు తాము అందించాల్సిన సహకారం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు మంచి ఊపుతో సాగుతాయి. కిరీటి తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించడానికి అవసరమైన సాంగ్స్ అతను అందించాడు. దేవి నేపథ్య సంగీతం కూడా ఓకే. సెంథిల్ కుమార్ విజువల్స్ బాగున్నాయి. సినిమా కలర్ ఫుల్ గా సాగింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చాలా రిచ్ గా తీశారు. కళ్యాణ చక్రవర్తి మాటలు కొన్ని చోట్ల పేలాయి. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి.. డెబ్యూ హీరోను హైలైట్ చేయడం మీద దృష్టిపెట్టాడు. అందులో అతను విజయవంతం అయినా.. కథాకథనాల్లో నిరాశపరిచాడు. తన స్టోరీ సాధారణంగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఒక టెంప్లేట్లో సాగిపోయింది.

చివరగా: జూనియర్.. కథ వీకే కానీ కుర్రాడు కేక

రేటింగ్- 2.5/5