సాయిపల్లవినే నమ్ముకున్న సూపర్‌స్టార్!
ఇప్పుడు ఇదే తరహా టెన్షన్ బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌ని పట్టి పీడిస్తోందని బాలీవుడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 12 July 2025 8:30 AM ISTఎంత స్టార్ కిడ్ అయినా సరైన సినిమా పడకపోతే కెరీర్ లో ముందుకు సాగడం కష్టం అనే విషయాన్ని ఇప్పటి వరకు స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన నెపోకిడ్స్ నిరూపించారు. ఇప్పటికీ ఆ విషయాన్ని నిరూపిస్తూనే ఉన్నారు. స్టార్ కిడ్ అయినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరించరని, మంచి సినిమా, ఆకట్టుకునే అభినయం ఉంటేనే వారికి ప్రేక్షకులు జేజేలు పలుకుతారని ఇప్పటి వరకు నిజమని తేలింది. ప్రేక్షకులు ఆదరించని స్టార్ కిడ్స్ చాలా వరకు తెరమరుగయ్యారు.
ఇప్పుడు ఇదే తరహా టెన్షన్ బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌ని పట్టి పీడిస్తోందని బాలీవుడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్‌ఖాన్ ఇటీవలే తన వారసుడు జునైద్ ఖాన్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. `మహారాజ్` సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించి తొలి చిత్రంతోనే విమర్శలు ఎదుర్కొన్నాడు జునైద్. ఇందులో హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వ్యక్తిగా కనిపించడంతో ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక రెండవ సినిమా అయినా తనని హీరోగా నిలబెడుతుందని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. జునైద్ ఖాన్ హీరోగా నటించిన రెండవ సినిమా `లవ్‌యాపా`. తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన `లవ్ టుడే`కిది రీమేక్. ఖుషీ కపూర్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ఈ సినిమా అక్కడ భారీ డిజాస్టర్ అనిపించుకుని జునైద్‌కు షాక్ ఇచ్చింది. దీంతో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమీర్‌ఖాన్ టెన్షన్ పడుతున్నాడట. ఈ నేపథ్యంలోనే జునైద్‌కు హిట్ కోసం సాయి పల్లవిని రంగంలోకి దించినట్టుగా ఇన్ సైడ్ టాక్.
జునైద్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఏక్ దిన్`. ఈ మూవీలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తోంది. ఇదే తన తొలి బాలీవుడ్ మూవీ. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. దీనిపై ఆమీర్‌ఖాన్‌తో పాటు జునైద్ కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడట. ఈ సినిమా యుఎస్‌పీ సాయి పల్లవి అని వారు నమ్ముతున్నారని, తనపైనే భారం వేశారని, ఇది హిట్ అయితేనే జునైద్ కెరీర్ ఊపందుకుంటుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
