Begin typing your search above and press return to search.

నాగవంశీకి తారక్ సాయం?

కానీ బిజినెస్ తగ్గితే తారక్ రేంజ్ తగ్గినట్లు అవుతుందని నాగవంశీ ఎక్కువ రేటు పెట్టి సినిమాను తీసుకున్నాడు.

By:  Garuda Media   |   20 Aug 2025 3:32 PM IST
Jr NTR Supports Naga Vamsi In War2 Failure
X

నిర్మాతల్లో కూడా అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోతో అసోసియేట్ కావడానికి వాళ్లు చాలా ఇష్టపడతారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన పెదనాన్న చినబాబుతో కలిసి తారక్‌తో ‘అరవింద సమేత’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు నాగవంశీ. తర్వాత తారక్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘దేవర’ సినిమాను ఫ్యాన్సీ రేటుకు కొని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు నాగవంశీ.

అది అతడికి మంచి ఫలితాన్నే ఇచ్చింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌తో ‘మ్యాడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలు తీసి తన కెరీర్ ఎదుగుదలలో నాగవంశీ కీలక పాత్ర పోషించాడు. దీంతో తారక్‌కు, అతడి అభిమానులకు నాగవంశీ బాగా దగ్గరయ్యాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ.. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’ దగ్గరికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. ఈ చిత్రానికి తెలుగులో సరైన బజ్ క్రియేట్ కాక, బిజినెస్ అనుకున్న మేర జరగని టైంలో నాగవంశీ ఎంటరయ్యాడు. తారక్ సినిమా ఎక్కడా తగ్గకూడదన్న ఉద్దేశంతో రూ.,80 కోట్లు పెట్టి తెలుగు హక్కులు కొన్నాడు. నిజానికి పెద్దగా పోటీ లేని నేపథ్యంలో నాగవంశీ తక్కువ రేటుకు అడిగినా యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు ఇచ్చేవాళ్లేమో.

కానీ బిజినెస్ తగ్గితే తారక్ రేంజ్ తగ్గినట్లు అవుతుందని నాగవంశీ ఎక్కువ రేటు పెట్టి సినిమాను తీసుకున్నాడు. ‘దేవర’ లెక్కలు చూసుకుని.. ఈ రేటు వర్కవుట్ చేయడం పెద్ద కష్టం కాదని అతననుకున్నాడు. కానీ ‘వార్-2’ పెట్టిన రేటులో సగానికి మించి షేర్ రాబట్టలేదు. ఇది నాగవంశీకి పెద్ద ఎదురు దెబ్బే.

ఐతే తనకు సపోర్ట్‌గా నిలుస్తూ, బావమరిదిని కూడా హీరోగా నిలబెట్టిన నాగవంశీకి కష్టకాలంలో తారక్ అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో మాట్లాడి అతడికి సెటిల్మెంట్ చేయడానికి అతను ట్రై చేస్తున్నాడట. అవసరమైతే తన పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా తారక్ రెడీ అయినట్లు తెలుస్తోంది. నాగవంశీ తన సినిమాలు వేటికి నష్టం వచ్చినా బయ్యర్లకు నష్టాలు భర్తీ చేస్తుంటాడు. కింగ్డమ్, వార్-2 సినిమాలు తేడా కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు నాగవంశీ ఇబ్బంది పడుతున్నాడు.

తన దగ్గర డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్లను అతను ఆదుకోవాల్సి ఉంది. కానీ సొంతంగా అతను వీళ్లందరికీ సాయం చేసే పరిస్థితుల్లో లేడు. ఈ నేపథ్యంలోనే ‘వార్-2’ కోసం కట్టిన డబ్బుల నుంచి యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు కొంత వెనక్కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ కీలక పాత్ర పోషించాడని అంటున్నారు. వాళ్లు వెనక్కి ఇచ్చే డబ్బులతో బయ్యర్లకు చాలా వరకు సెటిల్ అయిపోతుందని.. మొత్తానికి నాగవంశీ స్వల్ప నష్టాలతో గట్టెక్కే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.