తారక్ వార్ 2 ఒప్పుకోవడం వెనుక పెద్ద కథే ఉందే..!
ఈ సందర్భంగా ఆ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
By: Madhu Reddy | 6 Aug 2025 12:57 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ సినీ రంగప్రవేశం చేస్తున్న మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కథానాయకుడిగా, కియారా అద్వానీ కథానాయికగా చేస్తున్న చిత్రం ఇది. వార్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ కూలీ చిత్రానికి పోటీగా రంగంలోకి దిగబోతోంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మ్యాగజైన్ "ఎస్క్వేర్ ఇండియా" తాజా ఎడిషన్ కవర్ పేజీపై తారక్ ఫోటోని ముద్రించింది. ఈ సందర్భంగా ఆ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా వార్ 2 సినిమాలో తాను నటించడం వెనుక అసలు విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వార్ 2 సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తున్నారు. దక్షిణాది, ఉత్తరాది టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేశారు. ఇకపై టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనే తారతమ్యాలు లేవు. మనమంతా ఒకటే ఇండస్ట్రీ. ఇకపై భారతీయ చిత్ర పరిశ్రమగా మాత్రమే గుర్తించబడాలి. మరోవైపు సినిమా హిట్ అవ్వాలి అంటే ఇలా సినిమాలు తీస్తేనే అవి హిట్ అవుతాయి అనే ప్రత్యేకమైన ఫార్ములాలు ఏవి కూడా ఉండవు. కేవలం మనం ఎంచుకున్న కథను ప్రేక్షకులకు నచ్చే విధంగా చూపించాలి అంతే. ఈ విషయాన్ని గతంలో రాజమౌళి కూడా తెలిపారు. అయితే ఇప్పుడు నేను ఈ వార్ 2 సినిమా ఎంచుకోవడానికి కారణం కూడా స్క్రిప్ట్. బలమైన కథతోనే ఇది రూపొందుతోంది.అందుకే ఒప్పుకున్నాను. పైగా హృతిక్ రోషన్ తో కలిసి పనిచేయడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది అంటూ తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.
మొత్తానికైతే బలమైన స్క్రిప్ట్ కారణంగానే ఈ సినిమాలో విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అని స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో ఎన్టీఆర్ విలన్ గా, హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. పైగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన "ఊపిరి ఊయలగా " పాటకి కూడా అటు సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. మరి ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమా అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ రోషన్ లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం వార్ 2 సినిమాపై అంచనాలు పెట్టుకున్న ఈయన.. మరొకవైపు తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
