తారక్ లైనప్.. ఆ కాంబో సంగతేంటి?
ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు, మూడు ప్రాజెక్టులు లైనప్ లో కనిపిస్తే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది.
By: M Prashanth | 6 July 2026 4:00 AM ISTఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు, మూడు ప్రాజెక్టులు లైనప్ లో కనిపిస్తే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే భారీ సినిమాలతో బిజీగా ఉన్న తారక్ లైనప్ లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్ కూడా ఉందనే విషయంలో తాజాగా మరింత క్లారిటీ వచ్చింది. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించిన లెనిన్ జూలై 10న విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను ఆయన పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నెల్సన్ కాంబోలో చాలా కాలంగా ప్రచారంలో ఉన్న సినిమాపైనా స్పందించారు. నెల్సన్ తనకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో ఒకరని చెప్పిన నాగవంశీ.. ఆయనతో సినిమా చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.
అంతేకాదు ప్రాజెక్టులో హీరోగా దాదాపు ఎన్టీఆరే ఉంటారని స్పష్టం చేశారు. మొదటి నుంచి నెల్సన్ కూడా తారక్ తో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. దీంతో క్రేజీ కాంబోపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, నెల్సన్ ఇద్దరూ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ పై ఫోకస్ పెట్టారు.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తారక్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దేవర 2 కూడా ఆయన లైనప్‌లో ఉంది. నెల్సన్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే తదుపరి ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది.
దీంతో ఎన్టీఆర్, నెల్సన్ కాంబినేషన్ లో సినిమా ఖాయమైనా.. సెట్స్ పైకి వెళ్లేందుకు మాత్రం టైమ్ పట్టేలా కనిపిస్తోంది. మధ్యలో ఆ ప్రాజెక్టులో ఎన్టీఆర్ స్థానంలో మరో స్టార్ హీరో నటించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తారక్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో హీరో మారే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే నాగవంశీ తాజా వ్యాఖ్యలతో ఆ రూమర్లకు దాదాపుగా చెక్ పడినట్లయింది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఎన్టీఆర్- నెల్సన్ సినిమా ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ప్రాజెక్ట్ మాత్రం లైనప్ లో ఉన్నట్లేనని నాగవంశీ కామెంట్స్ తో క్లారిటీ వచ్చింది. ఇద్దరి కమిట్మెంట్లు పూర్తయి, డేట్స్ కుదిరితే ఆ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి తారక్ భారీ లైనప్ లో నెల్సన్ సినిమాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి.
