కష్ట సమయంలో ఎన్టీఆర్ అండ.. చిత్రం శ్రీను చెప్పిన నిజం వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఎంతోమందికి సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకున్నారు.
By: Madhu Reddy | 21 Jun 2026 9:41 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఎంతోమందికి సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ కమెడియన్ చిత్రం శ్రీను ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చెప్పిన ఒక ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాను కెరీర్ ప్రారంభంలో ప్రమాదానికి గురై బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు తారక్ తన ఇంటికి వచ్చి ఎంతలా ఆదుకున్నారో గుర్తుచేసుకుని శ్రీను ఎమోషనల్ అయ్యారు.. ఆ వివరాలు ఇలా వున్నాయి..
‘నిన్ను చూడాలని’ షూటింగ్‌లో పరిచయం:
చిత్రం శ్రీను తన కెరీర్ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ డెబ్యూ మూవీ ‘నిన్ను చూడాలని’ సినిమాలో నటించారు. ఆ సినిమాకు ప్రతాప్ గారు దర్శకుడు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, చిత్రం శ్రీను ఎంతో క్లోజ్‌గా ఉండేవారట. ఇక ఒకరోజు మధ్యాహ్నం శ్రీనుకు ‘నువ్వు నేను’ సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఎన్టీఆర్ వద్ద సెలవు తీసుకుని వెళ్తుండగా, తారక్ ఎంతో సరదాగా "ఎందుకు వెళ్తావు.. ఇక్కడే ఉండచ్చుగా " అని ఆపడానికి ట్రై చేశారట. కానీ శ్రీను అది కూడా పెద్ద సినిమా అని చెప్పి బయలుదేరారు.
ఊహించని యాక్సిడెంట్.. ఎన్టీఆర్ షాక్:
అలా షూటింగ్‌కు వెళ్తున్న దారిలో చిత్రం శ్రీనుకు ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కాలు తీవ్రంగా విరిగిపోయింది. ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఉదయం వరకు తమతో ఎంతో సరదాగా గడిపిన వ్యక్తికి ఇలా జరగడం ఏంటని యూనిట్ సభ్యుల వద్ద ఎంతో కంగారు పడ్డారట. శ్రీనుకు ఆపరేషన్ జరిగాక హాస్పిటల్ నుంచి తన రూమ్‌కు షిఫ్ట్ చేశారు.
రూమ్‌కు వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చిన తారక్:
చిత్రం శ్రీను రూమ్‌లో ఉన్నారనే విషయం తెలుసుకుని ఎన్టీఆర్ కారు నిండా కొబ్బరి బోండాలు వేసుకుని స్వయంగా చూడటానికి వచ్చారు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, తనలాంటి చిన్న నటుడి కోసం రూమ్‌కి రావడం శ్రీను అస్సలు ఊహించలేదు. ఇక శ్రీను బెడ్ రెస్ట్‌లో ఉండటాన్ని చూసి చలించిపోయిన ఎన్టీఆర్, ఒక చెక్ చేతిలో పెట్టి "నీ పరిస్థితి బాగోలేదు కదా.. ఈ చెక్‌లో నీకు ఎంత డబ్బు కావాలో అంత రాసుకుని తీసుకో" అని చెప్పారు.
6 నెలల బెడ్ రెస్ట్.. ఎప్పటికీ మర్చిపోలేను:
కాలి గాయం వల్ల చిత్రం శ్రీను దాదాపు 6 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ కష్ట సమయంలో ఎన్టీఆర్ అంతలా కేర్ తీసుకోవడం, తనే వద్దంటున్నా వినకుండా హెల్ప్ చేయడానికి ముందుకు రావడం చిత్రం శ్రీనును ఎంతో కదిలించింది. ఇక ఆ రోజుల్లో తారక్ చూపించిన మానవత్వాన్ని, ఆదరణను తానూ ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఇంటర్వ్యూలో చిత్రం శ్రీను ఎంతో ఎమోషనల్ అయ్యారు.
స్టార్ హీరోగా ఎదిగినా సరే, తోటి నటుల కష్టాల్లో తోడు నిలబడే గుణం ఎన్టీఆర్‌కు అప్పట్లోనే ఉందనడానికి చిత్రం శ్రీను చెప్పిన ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. అందుకే ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు, నెటిజన్లు "మా డార్లింగ్ తారక్ బంగారం.. అందుకే ఆయనకు అంతటి క్రేజ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక చిత్రం శ్రీను షేర్ చేసిన ఈ రియల్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
