Begin typing your search above and press return to search.

తారక్ చెక్ పెట్టాల్సిందేనా? లేకుంటే ఎక్కడా ఆగేలా లేదు!

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   17 July 2026 10:07 AM IST
తారక్ చెక్ పెట్టాల్సిందేనా? లేకుంటే ఎక్కడా ఆగేలా లేదు!
X

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్ల మధ్య విభేదాలు కనిపించడం కొత్తేమీ కాదు. కానీ ఒకే హీరో అభిమానులు మూడు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు చేసుకోవడం మాత్రం అరుదు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రా ఎన్టీఆర్ సంస్థ ప్రకటించిన కార్యక్రమం ఆ వివాదానికి సెంటర్ పాయింట్ గా మారింది.

తిరుపతిలో నిర్వహించనున్న కార్యక్రమంపై మొదట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో లింక్ చేస్తూ ప్రచారం జరగడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. దీంతో అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఆ ప్రచారం ఊపందుకున్న తర్వాత ఎన్టీఆర్ అఫీషియల్ టీమ్ స్పందించడం కీలక పరిణామంగా మారింది.

రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎన్టీఆర్ పేరు ఉపయోగించి ఎవరూ కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టమైన ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం తారక్ పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని కూడా అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆ వ్యవహారం ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కొందరు అభిమానులు రా ఎన్టీఆర్ సంస్థపై తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు.

ఎన్టీఆర్ పేరును ఉపయోగించి అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. సంస్థ పేరుతో నిధుల సేకరణ జరిగిందా? సేకరించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఆ అంశంపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు రా ఎన్టీఆర్ సంస్థ మద్దతుగా నిలుస్తున్న వర్గం మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది.

తాము ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఎన్టీఆర్ పై అభిమానంతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతోంది. ఆయన వద్దంటే వెంటనే అన్నీ ఆపేస్తామని పేర్కొంటోంది. దీంతో అభిమానుల్లో మరో వర్గం వారికి మద్దతు తెలుపుతోంది. ఇక మూడో వర్గం మాత్రం మొత్తం వ్యవహారాన్ని విమర్శిస్తోంది. ఎన్టీఆర్ పేరు చుట్టూ అవసరం లేని వివాదాలు సృష్టించడం వల్ల హీరో ఇమేజ్‌ కే నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతోంది. అఫీషియల్ టీమ్ స్పష్టత ఇచ్చిన తర్వాత వివాదం కొనసాగడం సరైనది కాదని చెబుతోంది.

అలా ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మూడు వేర్వేరు అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం అధికారిక ప్రకటనకు పూర్తి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం రా ఎన్టీఆర్ కు అండగా నిలుస్తోంది. ఇంకో వర్గం మాత్రం మొత్తం వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల మధ్య పెరుగుతున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే మరింత క్లారిటీ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. అందుకే ఎన్టీఆర్ చెక్ పెట్టాల్సిందేనని, లేకపోతే వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చెప్పడం కష్టమేని నెటిజన్లు అంటున్నారు.