Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ వండే ఆ రెండు చాలా ఇష్టం..!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ పలు సందర్భాల్లో తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   19 April 2025 3:00 PM IST
ఎన్టీఆర్‌ వండే ఆ రెండు చాలా ఇష్టం..!
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ పలు సందర్భాల్లో తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. తెలుగు బిగ్‌ బాస్ మొదటి సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన సమయంలో ఒక సారి హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌కి తన చేతులతో వండి పెట్టిన విషయం తెల్సిందే. ఒత్తిడిలో ఉన్న సమయంలో వంట చేస్తే తనకు చాలా రిలాక్స్‌గా ఉంటుందని, వంట చేసి ఎదుటి వారికి వడ్డించి వారు తింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని కూడా ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు. హీరోల్లో అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటి అలవాటు కలిగి ఉంటారు. ఒకవేళ వంట చేసే ఆసక్తి, అభిరుచి ఉన్నప్పటికీ చాలా మంది బయటకు చెప్పుకోక పోవచ్చు.

ఎన్టీఆర్‌ మాత్రం ఎప్పుడూ తన వారి కోసం వండి పెడుతూ, వారు తింటే సంతోషిస్తూ ఉంటాడు. ఒక్క రకం అని కాకుండా చాలా రకాల వంటలను ఎన్టీఆర్‌ చేస్తాడు. ఆయన చేతి వంట తిన్న వారు చాలా మంది వావ్ అన్నారు. ఆ మధ్య మ్యాడ్‌ 2 సినిమా ప్రమోషన్ సమయంలో నార్నె నితిన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ చేసే వంట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బావ చేసిన ఎలిపాయ కారం తనకు చాలా ఇష్టం అన్నాడు. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్‌ ఆ విషయమై మాట్లాడాడు. తమ్ముడు కి వంట అంటే చాలా ఇష్టం అంటూ కళ్యాణ్ రామ్‌ కూడా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ చేతులతో వండిన వంటకాలను కళ్యాణ్ రామ్‌ పలు సందర్భాల్లో తిన్నాడట.

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా ప్రమోషన్‌లో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్‌ మాట్లాడుతూ.. తారక్‌కి వంట చేయడం చాలా ఇష్టం. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం వంట చేస్తాడు. అతడు ఏ వంట అయినా చేయగలరు. తారక్‌ చేసిన వంటల్లో నాకు మటన్ దాల్చా, నాటు కోడి పులుసు అంటే చాలా ఇష్టం అన్నాడు. తారక్‌ చేతుల మీదుగా ఆ వంటలను ఎప్పుడూ తినాలని అనుకుంటాను అన్నాడు. ఎన్టీఆర్‌ తన సన్నిహితులకు, స్నేహితులకు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అభిమానులకు సైతం తన చేతి వంట రుచి చూపించడం మనం చూస్తూ ఉంటాం.

ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్‌ సరదాగా వంట చేయడం, దాన్ని సన్నిహితులకు రుచి చూపించడం గొప్ప విషయం. వంట అనేది కేవలం ఆడవారు మాత్రమే చేసేది అంటూ కొందరి ఫీలింగ్‌ కానీ ఎన్టీఆర్‌ మాత్రం వంట చేయడం అభిరుచిగా పెట్టుకోవడంతో పాటు, తన సన్నిహితులకు ఎప్పటికప్పుడు వండి పెట్టడం, వారికి కొత్త వంటకాలను రుచి చూపించడం అభిరుచిగా పెట్టుకోవడం గొప్ప విషయం. ఖాళీ సమయం లభిస్తే ఎన్టీఆర్‌ పాక మాస్టర్ అవుతాడట. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వార్‌ 2 సినిమాతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమాలో నటిస్తున్నాడు. వార్‌ 2 ఈ ఏడాదిలో విడుదల కానుండగా డ్రాగన్ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.