నీల్‌కి ఎన్టీఆర్ బర్త్‌డే విష్ ఇలా..!
కన్నడ సినిమాకు పెద్దగా ప్రాముఖ్యత లేని రోజుల్లో కేజీఎఫ్ సినిమాను తీసుకు వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తాము ఏమీ తక్కువ కాదని నిరూపించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్
By: Tupaki Desk | 4 Jun 2025 2:38 PM ISTకన్నడ సినిమాకు పెద్దగా ప్రాముఖ్యత లేని రోజుల్లో కేజీఎఫ్ సినిమాను తీసుకు వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తాము ఏమీ తక్కువ కాదని నిరూపించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం షాక్ అయ్యే విధంగా ప్రశాంత్ నీల్ తన మేకింగ్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ఇక కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ గురించి దేశ వ్యాప్తంగా మరింతగా చర్చ జరిగింది. కన్నడ సినిమా అంతకు ముందు వరకు వంద కోట్ల వసూళ్లను సైతం పెద్దగా చూసిన సందర్భాలు లేవు. అలాంటిది కేజీఎఫ్ తో ఏకంగా రూ.1000 కోట్లకు మించిన వసూళ్లు ఇవ్వడంతో ఇండియన్ సినిమా రంగంలో కన్నడ సినిమా స్థాయి మరింత పెరిగింది.
ప్రస్తుతం దేశంలోని అన్ని భాషల హీరోలు సైతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నారు. కేజీఎఫ్ తర్వాత సలార్ సినిమాను ప్రభాస్‌తో చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో షూటింగ్‌ను జరుపుతున్న విషయం తెల్సిందే. నేడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనతో వర్క్ చేస్తున్న ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ద్వారా ప్రశాంత్ నీల్‌కి ఎన్టీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్. మీ దార్శనికత మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. తెరపై మరింత ఉత్సాహంగా ఉండబోతోంది అని ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయిదు ఆరు సంవత్సరాల క్రితమే వీరి కాంబో మూవీ గురించి అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ స్టార్‌డంతోనే ప్రస్తుతం హిందీలో వార్ 2 సినిమాను చేస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా మంచి వసూళ్లు సొంతం చేసుకున్నా.. ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకుల్లో వెలితి ఉంది. ఆ వెలితిని తొలగించే విధంగా వార్ 2 తో పాటు డ్రాగన్ సినిమా ఉంటుంది అనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్‌లను మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాను ప్రశాంత్ నీల్ తీస్తున్నాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం వమ్ము కాకుండా ఉంటుందా అనేది చూడాలి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రశాంత్ నీల్‌కి అందరి తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
