Begin typing your search above and press return to search.

నవ్వుల చక్రవర్తి కుమార్తె కన్నుమూత... ఆలస్యంగా వెలుగులోకి!

చార్లీ చాప్లిన్ కుమార్తె, జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు

By:  Tupaki Desk   |   22 July 2023 3:51 PM IST
నవ్వుల చక్రవర్తి కుమార్తె కన్నుమూత... ఆలస్యంగా వెలుగులోకి!
X

తన నటనతో, తనదైన హాస్యంతో యావత్ ప్రపంచాన్ని కట్టిపడేసిని చార్లీ చాప్లిన్ గురించి ప్రపంచానికి పరిచయం అక్కరలేదన్నా అతిశయోక్తి కాదు! ఆ ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు, నవ్వుల రేడు చార్లీచాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు.

అవును... చార్లీ చాప్లిన్ కుమార్తె, జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఈ నెల 13న పారిస్‌ లో ఆమె మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు వెళ్లడించారు. అయితే సుమారు 10రోజులు క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారనేది తెలియాల్సి ఉంది.

28 మార్చి 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జోసెఫిన్ చాప్లిన్ జన్మించారు. చార్లీ చాప్లిన్ - ఊనా ఓ నీల్‌ దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా వారిలో జోసెఫిన్ చాప్లిన్ మూడో సంతానం. 1949లో జన్మించిన ఆమె... 1952లో తన తండ్రి సినిమా "లైమ్‌ లైట్"తో చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు.

అనంతరం 1969లో నికోలస్‌ ను పెళ్లి చేసుకుని 1977లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో 1972లో అవార్డు విన్నింగ్ సినిమా "పీర్ పావలో పాసోలిని" తోపాటు మరెన్నో సినిమాల్లో ఆమె నటించారు. ఆ తర్వాత ఫ్రెంఛ్ నటుడు మారిస్ రోనెట్ తో అతను మరణించే వరకు (1983 వరకు) కలిసి సహజీవనం చేశారు.

తర్వాత తను పలు సినిమాలతో బిజీగా ఉంటూ.. సుమారు పదేళ్ల తర్వాత 1989లో ఆర్కియాలజిస్ట్ జీన్‌ క్లూడ్‌ గార్డెన్‌ ను వివాహం చేసుకున్నారు. అతను 2013లో అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ముగ్గురు కుమారులు చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్‌ లు ఉన్నారు. ఆమె మృతికి హాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.