Begin typing your search above and press return to search.

37 ఎక‌రాల్లో విలేజ్ కొనుక్కుని బాగు చేసిన స్టార్ హీరో

37 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఎస్టేట్‌లో 15 బెడ్‌రూమ్‌లు- 14 బాత్‌రూమ్‌లతో కూడిన మెయిన్ హౌస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

By:  Tupaki Desk   |   17 Sept 2026 9:00 AM IST
37 ఎక‌రాల్లో విలేజ్ కొనుక్కుని బాగు చేసిన స్టార్ హీరో
X

హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన విలాసవంతమైన రియల్ ఎస్టేట్ కొనుగోళ్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సంవత్సరాల క్రితం దక్షిణ ఫ్రాన్స్ వాతావరణానికి ఆకర్షితులైన అత‌డు 2001లో ఏకంగా ఒక ఫ్రెంచ్ గ్రామాన్ని కొనుగోలు చేశారు. సెయింట్ ట్రోపెజ్ ప్రాంతానికి 17 మైళ్ల దూరంలో ఉన్న ఈ 19వ శతాబ్దపు గ్రామం అప్పట్లో పాడుపడిపోయి ఉండేది. హాలీవుడ్ ఒత్తిడిల నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి ఆయన ఈ ప్రైవేట్ వేకేషన్ స్థలాన్ని ఎంచుకున్నారు.

ఈ పాడుబడిన గ్రామాన్ని పునరుద్ధరించడానికి జానీ డెప్ భారీగానే ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం అతడు సుమారు 10 మిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. ఇందులో స్విమ్మింగ్ పూల్స్, ఆర్ట్ స్టూడియోస్, తన `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` సినిమా పాత్రకు గుర్తుగా పైరేట్ థీమ్‌తో కూడిన అండర్‌గ్రౌండ్ వైన్ సెల్లార్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

37 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఎస్టేట్‌లో 15 బెడ్‌రూమ్‌లు- 14 బాత్‌రూమ్‌లతో కూడిన మెయిన్ హౌస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు జిమ్, చాపెల్, వర్క్‌షాప్, రెస్టారెంట్, బార్ .. సుమారు 6 గెస్ట్ హౌస్‌లు ఈ ప్రాపర్టీలో ఉన్నాయి. అలాగే విలేజ్ టౌన్‌స్క్వేర్ ప్రాంతాన్ని లగ్జరీ డైనింగ్ ఏరియాగా మార్చి `షెజ్ మార్సెలిన్` అని పేరు పెట్టి ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా తీర్చిదిద్దారు.

అయితే ఈ అద్భుతమైన ప్రాపర్టీని విక్రయించడానికి జానీ డెప్ గతంలో పలుమార్లు ప్రయత్నించారు. 2015, 2016 సంవత్సరాల్లో 27 మిలియన్ డాలర్లకు.. ఆ తర్వాత 2021లో 63 మిలియన్ డాలర్లకు.. 2022లో 55 మిలియన్ డాలర్లకు దీనిని లిస్ట్ చేశారు. కానీ 2024 నాటికి ఈ ఎస్టేట్ అమ్మకాన్ని రెనోవేషన్స్ కోసం తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. జానీ డెప్ `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లోని ఆరో భాగంలో `క్యాప్టెన్ జాక్ స్పారో` పాత్రలో మళ్లీ నటించేందుకు అత‌డు నిర్మాత జెర్రీ బ్రూక్‌హైమర్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు `అంబర్ హెర్డ్` కేసుల సమయంలో హ్యారీ పాటర్ స్పిన్-ఆఫ్ `ఫాంటాస్టిక్ బీస్ట్స్` నుంచి జానీ డెప్ తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.