గేట్లు గుద్దుకుంటూ నటి ఇంట్లోకి దూసుకొచ్చిన కార్
సెక్యూరిటీ చూస్తుండగానే కార్ గేట్లు గుద్దుకుంటూ ఇంట్లోకి జొరబడింది. దుండగుడు దూకుడుగా దురుసుగా కనిపించాడు.
By: Tupaki Desk | 7 May 2025 4:04 AMసెక్యూరిటీ చూస్తుండగానే కార్ గేట్లు గుద్దుకుంటూ ఇంట్లోకి జొరబడింది. దుండగుడు దూకుడుగా దురుసుగా కనిపించాడు. దీంతో బెంబేలెత్తిన సెక్యూరిటీ ఆ కార్ ని ఆపేందుకు ప్రయత్నించారు. చివరికి ప్రయత్నం ఫలించి అతడిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ ఇంటి వోనర్ అయిన ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ ఇంట్లో లేరని తెలిసింది. అలాగే దుండగుడి కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు పరిశోధిస్తున్నారు.
జెన్నిఫర్ అనిస్టన్ లాస్ ఏంజెల్స్ ఇంటి ముందు గేటును ఒక వ్యక్తి తన కారుతో ఢీకొట్టి లోనికి దూసుకొచ్చాడని CNN తన కథనంలో పేర్కొంది. సంఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి అయిన ఆఫీసర్ జెఫ్ లీ వివరాల్ని అందించారు. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 12:20 గంటల ప్రాంతంలో జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని సంపన్న పొరుగు ప్రాంతం బెల్ ఎయిర్‌లో ఉన్న ఐరోల్ వేలోని 900 బ్లాక్‌లోకి కార్ దూసుకొచ్చింది. 70 వయసున్న శ్వేతజాతీయుడిని దొంగ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
జెన్నిఫర్ అనిస్టన్ టీవీ సిరీస్ `క్లాసిక్ సిట్‌కామ్ ఫ్రెండ్స్`లో తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆడమ్ శాండ్లర్‌తో కలిసి 2019 థ్రిల్లర్ కు సీక్వెల్ `మర్డర్ మిస్టరీ 2`లో నటించింది.