'దృశ్యం 3' హిందీ నిర్మాతలకు లీగల్ నోటీసు?
ప్రస్తుతం మలయాళ 'దృశ్యం 3' అక్టోబర్ 2025లో ప్రారంభం కానుంది. ఇటీవల ఓ సమావేశంలో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తిగా రాసుకున్నానని దర్శకుడు జీతు జోసెఫ్ తెలిపారు.
By: Tupaki Desk | 22 July 2025 9:55 AM ISTథ్రిల్లర్ కేటగిరీలో వచ్చిన మలయాళీ చిత్రాలు దృశ్యం, దృశ్యం 2 పేరుతో ఇరుగు పొరుగు భాషల్లోను రీమేకైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలోను రీమేకైన ఈ ఫ్రాంఛైజీ చిత్రాలు అన్ని భాషల్లోను బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. మలయాళ వెర్షన్లలో మోహన్ లాల్ కథనాయకుడు కాగా, తెలుగు వెర్షన్ లో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిందీ వెర్షన్లలో అజయ్ దేవగన్ కథానాయకుడు కాగా, తమిళ వెర్షన్ లో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించారు.
ప్రస్తుతం మలయాళ 'దృశ్యం 3' అక్టోబర్ 2025లో ప్రారంభం కానుంది. ఇటీవల ఓ సమావేశంలో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తిగా రాసుకున్నానని దర్శకుడు జీతు జోసెఫ్ తెలిపారు. దృశ్యం 3తో పాటు, ఆయన మరో రెండు ప్రాజెక్టులు (మిరాజ్, వాలతు వషతే) పైనా పనిచేస్తున్నారు. అయితే దృశ్యం 3 క్లైమాక్స్ రాసేందుకు తెల్లవారుఝామున 3.30 గంటలకు నిదుర లేచానని, ఇది చాలా కఠినమైనదని జీతూ అన్నారు.
ఇంతలోనే దృశ్యం 3 హిందీ వెర్షన్ విషయంలో ఘర్షణ తలెత్తిందని కూడా ఆయన వెల్లడించారు. అజయ్ దేవగన్ బృందం మలయాళ వెర్షన్ కంటే ముందే హిందీ వెర్షన్ ని తెరకెక్కించాలని ప్లాన్ చేసిందని, కానీ దానిని తాను ఆపానని వెల్లడించారు. లీగల్ నోటీసు పంపుతానని బెదిరించడంతో హిందీ చిత్రనిర్మాతలు వేచి చూస్తున్నారని కూడా తెలిపారు. అక్టోబర్ లో మలయాళ వెర్షన్ ప్రారంభమైతే, అదే సమయంలో హిందీ వెర్షన్ ని కూడా అజయ్ దేవగన్ ప్రారంభించాల్సి ఉంది. కానీ హిందీ నిర్మాతలు త్వరగా ప్రారంభించాలనుకున్నారు. కానీ కొన్ని చర్చల తర్వాత దానిని వాయిదా వేసారు.
2013 లో దృశ్యం ఫ్రాంచైజ్ ప్రారంభమైంది. జార్జ్ కుట్టి అనే కేబుల్ ఆపరేటర్ కుటుంబం ఎలాంటి కష్టాల్లో పడింది? అన్నదే ఈ సినిమా. కుమార్తె కారణంగా ఒక వ్యక్తి అదృశ్యం కేసులో చిక్కుకున్నప్పుడు కేబుల్ ఆపరేటర్ జార్జ్ జీవితం పూర్తిగా తలక్రిందులవుతుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి చిక్కకుండా తన కుమార్తెను, కుటుంబాన్ని జార్జ్ కుట్టి ఎలా కాపాడుకున్నాడు? అన్నదే సినిమా కథాంశం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కథాంశంతో జీతూ రక్తి కట్టించారు. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్లు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. తమిళంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
