Begin typing your search above and press return to search.

'హీరోయిన్‌ తో మిస్‌ బిహేవ్ చేస్తే కొట్టా'.. జేడీ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్ల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడు చెబుతున్నానని, అయితే రెండేళ్లలో ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు తగ్గుతున్నాయని అన్నారు.

By:  M Prashanth   |   8 May 2026 9:48 AM IST
హీరోయిన్‌ తో మిస్‌ బిహేవ్ చేస్తే కొట్టా.. జేడీ సంచలన వ్యాఖ్యలు
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌, అవకాశాల పేరుతో జరిగే వేధింపుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా సీనియర్ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఆ అంశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన గాయపడ్డ సింహం సినిమా పోస్ట్ ప్రమోషన్ల సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులతోపాటు ఓ సంఘటన గురించి బహిరంగంగా మాట్లాడారు.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తాను పనిచేసిన ఓ సినిమాలో హీరోయిన్‌ తో నిర్మాత అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఆ ఘటన చూసి తాను ఆ నిర్మాతను కొట్టానని చెప్పారు. అయితే ఆ సినిమా పేరు కానీ, నిర్మాత వివరాలు కానీ బయటపెట్టబోనని స్పష్టం చేశారు. వారి కోసం మాట్లాడాలని తనకు ఆసక్తి లేదని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం అలాంటిదిగా చూపించడం సరైనది కాదని జేడీ అభిప్రాయపడ్డారు.

సినిమా పరిశ్రమలో 95 శాతం మంది ఎంతో ప్రొఫెషనల్‌ గా ఉంటారని, కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఇలాంటి తప్పులు చేస్తారని అన్నారు. ఇతర ఇండస్ట్రీల్లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలకు కారణమయ్యే వారు నిజమైన సినీ నిర్మాతలు కాదని జేడీ పేర్కొన్నారు. కొంతమంది ఇతర వ్యాపారాలు చేస్తూ సరదాగా సినిమా తీయాలని ఇండస్ట్రీలోకి వస్తారని చెప్పారు.

వాళ్లకు ప్రొఫెషనల్ వాల్యూస్ ఉండవని, కానీ నిజమైన నిర్మాతలు సినిమా కోసం మాత్రమే పనిచేస్తారని జేడీ చక్రవర్తి తెలిపారు. సినిమాలు ఆడాలని తీస్తారని చెప్పారు. వాళ్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తారని, తాము నటిస్తామని పేర్కొన్నారు. ఒక తప్పు జరిగితే మొత్తం పేరు పోతుందని వారికి తెలుసని అన్నారు. ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందని కూడా జేడీ వెల్లడించారు.

రెండేళ్ల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడు చెబుతున్నానని, అయితే రెండేళ్లలో ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు తగ్గుతున్నాయని అన్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడు కొందరు వచ్చి తప్పుగా ప్రవర్తిస్తుంటారని పేర్కొన్నారు. అలా టాలీవుడ్ లో మహిళల భద్రత, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీశాయి.

ఇటీవల కొందరు సినీ ప్రముఖులు తెలుగు అమ్మాయిలు ఎక్కువగా సినిమాల్లోకి రావాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో.. మరోవైపు మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై కూడా తరచూ చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో వేధింపులు, ఒత్తిడి వంటి అంశాలపై గతంలోనూ పలువురు హీరోయిన్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కూడా అదే అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చాయి. ఇక జేడీ నటించిన లేటెస్ట్ మూవీ గాయపడ్డ సింహంలో తరుణ్ భాస్కర్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఆ సినిమాలోని జేడీ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రం థియేటర్లలో ఆడుతోంది.