Begin typing your search above and press return to search.

భార్య ఆవేద‌న చెందినా బొమ్మాళీని వ‌ద‌ల‌ని స్టార్ హీరో!

తాజాగా చెన్నైలోని ఓ పెళ్లి వేడుక‌లో జ‌యం ర‌వి, త‌న ప్రియురాలు అని చెబుతున్న డాక్ట‌ర్ కెనీషా కెవిన్ ఫ్రాన్సిస్ తో క‌లిసి క‌నిపించాడు.

By:  Tupaki Desk   |   11 May 2025 8:36 AM
భార్య ఆవేద‌న చెందినా బొమ్మాళీని వ‌ద‌ల‌ని స్టార్ హీరో!
X

భార్య‌- ప్రియురాలి మ‌ధ్య త‌మిళ స్టార్ హీరో జ‌యం ర‌వి న‌లిగిపోతున్నాడ‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. భార్య‌కు విడాకులిస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన జ‌యం ర‌వి ఇటీవ‌ల కొంత కాలంగా మీడియాలో న‌లుగుతున్నాడు. అత‌డు వేరొక యువ‌తితో ప్రేమ‌లో ఉన్నాడ‌ని కోలీవుడ్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. ఆమె ప్రియురాలా కాదా? అనేది అటుంచితే, అత‌డు ప‌దే ప‌దే ప‌బ్లిగ్గా ఆమెతోనే క‌నిపించ‌డంతో ఇదే నిజ‌మ‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు.

తాజాగా చెన్నైలోని ఓ పెళ్లి వేడుక‌లో జ‌యం ర‌వి, త‌న ప్రియురాలు అని చెబుతున్న డాక్ట‌ర్ కెనీషా కెవిన్ ఫ్రాన్సిస్ తో క‌లిసి క‌నిపించాడు. రిసెప్ష‌న్ లో ఈ జంట సంద‌డికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ కాగానే, తిరిగి సీన్ లోకి భార్య ఆర్తి వ‌చ్చారు. త‌న భ‌ర్త జ‌యం ర‌వి తీరుపై తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. ఈ క‌ష్ట కాలంలో ఆర్తి ఎప్ప‌టిలాగే సోష‌ల్ మీడియాలో త‌న ఆవేద‌న‌ను పోస్ట్ చేసారు. ఇంకా విడాకులు ఇవ్వ‌కుండానే అత‌డు పిల్ల‌ల బాధ్య‌త‌ల్ని ప‌క్క‌న పెట్టేసాడ‌ని ఆర్తి ఆరోపించారు. ఓ భార్య‌గా అన్యాయానికి గురైన స్త్రీగా, ఓ తల్లిగా మాట్లాడుతున్నాను.. తండ్రి అంటే అదేదో టైటిల్ కాద‌ని బాధ్య‌త అని ఆర్తి ర‌వి అన్నారు.

ఈ ప‌రిస్థితుల్లో ఆర్తి ర‌వికి కొంద‌రు న‌టీమ‌ణులు అండ‌గా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సీనియ‌ర్లు అయిన రాధిక‌, ఖుష్బూ ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆర్తి ర‌వికి మ‌ద్ధ‌తుగా ఆ ఇద్ద‌రూ ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఒక తల్లి చెప్పే నిజం కాలంతో పాటు సాక్ష్యాధారంగా ఉంటుందని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఈ క‌ష్ట‌కాలంలో ఆర్తి బ‌లంగా ఉండాల‌ని రాధిక సూచించారు. పిల్లలతో విడిగా ఉంటున్న ఆర్తి రవికి న‌టీమ‌ణులు అండ‌గా నిల‌వ‌డం కొంత ఊర‌ట‌.

అయితే ఈ వివాదం కోర్టుల ప‌రిధిలో తేలాల్సి ఉంటుంది. జ‌యం ర‌వి త‌న క్ల‌యింట్ మాత్ర‌మేన‌ని, అత‌డి మాన‌సిక వ్యాధికి చికిత్స చేస్తున్నాన‌ని కెనీష చాలా కాలంగా చెబుతున్నారు. కానీ ప‌బ్లిక్ లో ఇలా జంట‌గా క‌లిసి క‌నిపిస్తూ అంద‌రికీ షాకిస్తున్నారు. కెనీషాతో అత‌డు పెళ్లి విందులో క‌నిపించాడు. ఆ త‌ర్వాత ఆర్తి ఆరోపించ‌గానే, మ‌రోసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి జంట‌గా క‌నిపించ‌డంతో ఇరువురి న‌డుమా ఏదో జ‌రుగుతోంద‌ని మ‌ళ్లీ మీడియాలు క‌థ‌నాలు వండి వారుస్తున్నాయి.