Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇచ్చి హీరోగానా? ముందు భయపడ్డాడా?

స్టార్ హీరోల వారసులు సాధారణంగా హీరోలుగానే సినీ జర్నీని మొదలుపెడతారు. కానీ ఇటీవల కొందరు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

By:  M Prashanth   |   15 July 2026 4:00 AM IST
డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇచ్చి హీరోగానా? ముందు భయపడ్డాడా?
X

స్టార్ హీరోల వారసులు సాధారణంగా హీరోలుగానే సినీ జర్నీని మొదలుపెడతారు. కానీ ఇటీవల కొందరు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నెపోటిజం కామెంట్లు, అంచనాల ఒత్తిడి, కంపేరిజన్ల నుంచి దూరంగా ఉండాలనే ఆలోచనతో కెమెరా ముందు కాకుండా, ముందుగా కెమెరా వెనుక తమ టాలెంట్ ను నిరూపించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కూడా అదే దారిలో నడుస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

జేసన్ సంజయ్‌ ను మొదట హీరోగా పరిచయం చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఫారిన్ కంట్రీస్ లో ఫిల్మ్ మేకింగ్‌ లో ట్రైనింగ్ తీసుకున్న జేసన్, దర్శకత్వంపై ఆసక్తితో తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో నటన కంటే ముందుగా కథ చెప్పే దర్శకుడిగా తన స్టామినాను చూపించాలని భావించారని తెలుస్తోంది.

ఆ నిర్ణయం వెనుక నెపోటిజం విమర్శల ప్రభావం కూడా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ హీరో కుమారుడిగా నేరుగా హీరోగా వస్తే విమర్శలు తప్పవని, అందుకే ముందుగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటుడిగా వస్తే ప్రేక్షకుల నుంచి మరింత పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుందనే ప్లాన్ ఉండొచ్చని ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే దీనిపై జేసన్ సంజయ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు.

ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. దర్శకుడిగా తన తొలి సినిమా పనులు కొనసాగుతుండగానే, హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వడానికి జేసన్ సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇటీవలి కాలంలో స్టార్ కిడ్స్‌ లో ఈ తరహా ఆలోచన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నేరుగా హీరోగా వచ్చి విమర్శలు ఎదుర్కొనే బదులు, రైటింగ్, డైరెక్షన్ లేదా ప్రొడక్షన్ వంటి విభాగాల్లో తమ టాలెంట్ చూపించి, ఆ తర్వాత నటన వైపు అడుగులు వేయడం మంచి వ్యూహంగా భావిస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో కూడా నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట. మరోవైపు జేసన్ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమా సిగ్మా కూడా ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్, అడ్వెంచర్, కామెడీ అంశాలతో రూపొందుతున్న ఆ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా రిలీజైన తర్వాత దర్శకుడిగా ఆయనకు ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో చూడాలి.

అయితే దర్శకుడిగా తొలి అడుగు వేసిన జేసన్ సంజయ్.. ఇప్పుడు హీరోగా కూడా లక్ ను టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌ గా మారింది. నిజంగానే నెపోటిజం కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ముందుగా మెగాఫోన్ పట్టారా? లేక దర్శకుడిగా తనకున్న ఆసక్తి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారా? అన్నది ఆయన మాత్రమే చెప్పగల విషయం. కానీ దర్శకుడిగా మొదలై హీరోగా జర్నీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.