Begin typing your search above and press return to search.

మళ్లీ మాస్‌లోకి జానీ మాస్టర్.. శ్రీలీలతో ఇలా..

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న 'మాస్ జాతర' సినిమాలో ఓ మాస్ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

By:  Tupaki Desk   |   15 July 2025 12:33 PM IST
మళ్లీ మాస్‌లోకి జానీ మాస్టర్.. శ్రీలీలతో ఇలా..
X

ఇటీవల జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పలు ఆరోపణలతో చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో కొన్నాళ్ల పాటు విచారణ జరిగిన తర్వాత బెయిల్‌పై బయటకి వచ్చిన జానీ మాస్టర్‌కి మరోసారి సినిమాల్లో అవకాశాలివ్వరేమోనని అందరూ అనుకున్నారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. జానీ మాస్టర్ మళ్లీ బిజీ అవుతూ బౌన్స్ బ్యాక్ అయ్యేలా కనిపిస్తున్నారు.

జైలు నుంచి వచ్చిన కొద్దికాలానికే జానీ మాస్టర్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆ మధ్య ఆయన బెంగుళూరులో ఓ కన్నడ సినిమా సెట్స్‌లోకి వెళ్లినప్పుడు ఘనంగా వెల్కమ్ ఇవ్వడంతో ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి తెలుగులో తన మార్క్ డాన్స్ కంపోజిషన్‌తో జానీ మాస్టర్ హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు.

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న 'మాస్ జాతర' సినిమాలో ఓ మాస్ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట షూటింగ్ పూర్తయిన తర్వాత జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు షేర్ చేస్తూ శ్రీలీలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. “మీ ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో పాట హైలైట్ అవుతుంది. ఈ పాటను థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేయడాన్ని ఎదురుచూస్తున్నా” అంటూ పొగడ్తలతో పాటు తాను ఎంత ఆనందంగా ఉన్నాడో తెలిపారు.

అలానే శ్రీలీల కూడా సెంటిమెంట్‌గా స్పందించి జానీ మాస్టర్‌కి థ్యాంక్స్ చెబుతూ ప్రత్యేకంగా ఫ్లవర్ బొకే పంపించారు. “థాంక్యూ మాస్టర్” అని ఉన్న బెలూన్‌తోపాటు అందమైన పూలతో డెకొరేట్ చేసిన ఆ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జానీ మాస్టర్ దీనిని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఓ గుర్తుగా నిలుపుకున్నారు.

ఈ పాటలోని స్టిల్స్ చూస్తే.. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించనుందని స్పష్టమవుతోంది. మాస్ వాతావరణంలో, రంగురంగుల సెటప్‌లో జరిపిన ఈ సాంగ్ నంబర్ పక్కా మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ రూపొందినట్టు కనిపిస్తోంది. 'ధమాకా' తర్వాత మరోసారి జానీ మాస్టర్ స్టెప్స్‌తో అందరినీ అలరించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక జానీ మాస్టర్ ఈ సాంగ్ తో ఎలాంటి గుర్తింపుని అందుకుంటాడో చూడాలి.