Begin typing your search above and press return to search.

జాన్వీకి టాలీవుడ్ లో మ‌రో బంప‌రాఫ‌ర్?

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న పెద్దిని బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 May 2025 11:10 AM IST
Janhvi Kapoor Tollywood Rise for Allu Arjun-Atlee Pan-India Film
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ చేసింది. తెలుగు సినిమాల్లోకి ఎంట‌రై సౌత్ సినిమాతో మంచి సంబంధాన్ని ఏర్ప‌ర‌చుకుంది జాన్వీ. త‌న తల్లి ఎక్కువ‌గా సినిమాలు చేసి రాణించిన తెలుగులో సినిమాలు చేస్తే త‌ల్లికి క్లోజ్ గా ఉండొచ్చ‌నే భావ‌న‌తో జాన్వీ టాలీవుడ్ పై ఎక్కువ ఫోక‌స్ చేసింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌ర సినిమాతో జాన్వీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు జాన్వీకి తెలుగులో వ‌రుస అవ‌కాశాలొస్తున్నాయి. దేవ‌ర సినిమా రిలీజ్ కాకుండా సెట్స్ పై ఉన్న‌ప్పుడే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాలో ఆఫ‌ర్ ను కొట్టేసింది. తెలుగులో మొద‌టి సినిమాను ఎన్టీఆర్ తో చేసిన జాన్వీ, రెండో సినిమాను చ‌ర‌ణ్ తో లైన్ లో పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న పెద్దిని బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ అథ్లెట్ గా క‌నిపించ‌నున్నాడు. కానీ పెద్దిలో జాన్వీ పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమా జాన్వీకి తెలుగులో మ‌రింత క్రేజ్ ను పెంచుతుంద‌ని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే పెద్ది సినిమా రిలీజ్ కాకుండా ఆ సినిమా సెట్స్ పై ఉన్న‌ప్పుడే జాన్వీకి తెలుగు నుంచి మ‌రో ఆఫ‌ర్ కూడా రాబోతున్న‌ట్టు స‌మాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కనున్న సినిమాలో జాన్వీ న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. జ‌వాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత అట్లీ నుంచి రాబోతున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఠాకూర్, అన‌న్యా పాండే లాంటి హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. అయితే ఇప్పుడదే సినిమాలో ఓ హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ను కూడా తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అన్నీ కుదిరి ఈ సినిమాలో కూడా జాన్వీ ఛాన్స్ అందుకుంటే టాలీవుడ్ లో జాన్వీ కెరీర్ కు ఇక తిరుగుండ‌ద‌ని చెప్పొచ్చు.