వరుణ్ ధావన్ కు జాన్వీ మద్దతు
ఇప్పుడు వరుణ్ వ్యాఖ్యలకు మద్దతిస్తూ మరో హీరోయిన్ రంగంలోకి దిగింది.
By: Tupaki Desk | 30 Jun 2025 6:25 AMనటి షెఫాలీ జరీవాలా అకస్మాత్తుగా మరణించిన తర్వాత మీడియా ప్రవర్తించిన తీరుపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుణ్ వ్యాఖ్యలకు మద్దతిస్తూ మరో హీరోయిన్ రంగంలోకి దిగింది. ఆమె మరెవరో కాదు. దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్న జాన్వీ కపూర్.
షెఫాలీ అంత్యక్రియల సందర్భంగా మీడియా ప్రవర్తించిన తీరుపై వరుణ్ ధావన్ అసహనం వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ చేశారు. మరొక ఆత్మకు సంబంధించిన విషాద వార్తను మీడియా కనీస సున్నితత్వం లేకుండా కవర్ చేసిందని, ఒకరి దుఃఖాన్ని ఎందుకు ప్రసారం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని, దాన్ని చూసేందుకు అందరూ చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారని, దీని వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు వరుణ్ ధావన్.
ఎవరూ తమ చివరి యాత్రను ఇలా కవర్ చేయాలని కోరుకోరని వరుణ్ ధావన్ తన పోస్ట్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వరుణ్ చేసిన ఈ పోస్ట్ కు జాన్వీ కపూర్ పూర్తి మద్దతు పలికింది. వరుణ్ పోస్ట్ ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఎట్టకేలకు ఎవరో ఒకరు ఈ విషయం చెప్పారని రాసుకొచ్చింది. జాన్వీ పోస్ట్ తో వరుణ్ ఒపీనియన్ తో తాను ఏకీభవిస్తున్నట్టు స్పష్టమైంది. బాధలో ఉన్నవారికి ప్రైవసీ ఇవ్వాలని జాన్వీ ఈ సందర్భంగా స్ట్రాంగ్ గా తెలియచేసింది.
కాగా రెండు రోజుల క్రితం నటి షెఫాలీ జరివాలా అకస్మాత్తుగా గుండెపోటుకు గురవగా, ఆమె భర్త పరాగ్ వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. హాస్పిటల్ కు వెళ్లే సమయానికే ఆమె మరణించినట్టు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. శనివారం షెఫాలీ అంత్యక్రియలు జరగ్గా ఆ అంత్యక్రియల వద్ద మీడియా వ్యవహరించిన తీరుపైనే నటుడు వరుణ్ ధావన్ అసహనం వ్యక్తం చేశారు.