ఏఐ ఎఫెక్ట్.. హీరోయిన్స్ లో కొత్త అనుమానం
జాన్వీ విషయంలో జరిగిన సంఘటనకు ఎన్టీఆర్ కూడా సీరియస్గా స్పందించారు. వీడియోను తయారు చేసినవాళ్లతో పాటు దాన్ని షేర్ చేస్తున్నవాళ్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
By: Tupaki Desk | 14 Oct 2026 9:02 AM ISTసినిమాలో హీరోయిన్ ఒకలా కనిపిస్తుంది. అదే సినిమాలోని పాట సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఆమె లుక్ పూర్తిగా మారిపోతుంది. కొత్తగా షూటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏఐతో ఒరిజినల్ వీడియోనే మార్చేస్తున్నారు. ఈ మధ్య 'దేవర'లోని 'చుట్టమల్లె' పాట విషయంలో జరిగినది ఇదే. జాన్వీ కపూర్ను అసభ్యంగా చూపించేలా వీడియోను మార్చడంతో పెద్ద వివాదం మొదలైంది. ఇప్పుడు శ్రియ కూడా తన ఫొటోలతో జరుగుతున్న ఇలాంటి వ్యవహారాల గురించి మాట్లాడారు.
జాన్వీ విషయంలో జరిగిన సంఘటనకు ఎన్టీఆర్ కూడా సీరియస్గా స్పందించారు. వీడియోను తయారు చేసినవాళ్లతో పాటు దాన్ని షేర్ చేస్తున్నవాళ్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాన్వీ కూడా ఇలా వీడియోలు తయారు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవం తనకూ ఎదురైందని శ్రియ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలో ఉన్నది తానేనా అనే సందేహం వస్తుందట.
శరీరాకృతిని మార్చడం, దుస్తులు తొలగించినట్లు చూపించడం లాంటివి జరుగుతున్నాయని వివరించారు. మొదట నవ్వొచ్చినా తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. దాదాపు పాతికేళ్లుగా సినిమాల్లో ఉన్న శ్రియకు కూడా ఇప్పుడు తన ఫొటో నిజమో కాదో గుర్తించాల్సిన పరిస్థితి రావడం గమనార్హం.
ఇక్కడే ఏఐ మార్ఫింగ్ గతంతో పోలిస్తే మరో స్థాయికి వెళ్లింది. ఒకప్పుడు ఫేక్ ఫొటోలకు హీరోయిన్ ముఖాన్ని జోడించేవారు. ఇప్పుడు ఆమె నిజంగా నటించిన పాటలోనే మార్పులు చేస్తున్నారు. సినిమా పేరు, ఒరిజినల్ లొకేషన్, పాటలోని విజువల్స్ అలాగే ఉండటంతో ఆ వీడియో నిజమైనదే అనుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ సమయంలో పాటల క్లిప్స్ విపరీతంగా షేర్ అవుతుంటాయి. అలాంటి కంటెంట్ మారిపోతే నటీనటుల అసలు లుక్ కూడా తప్పుగా ప్రచారంలోకి వెళ్తుంది.
ఈ వివాదంపై జాన్వీ, ఎన్టీఆర్ మాత్రమే కాకుండా చిరంజీవి, విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. మహిళలను అసభ్యంగా చూపించడానికి టెక్నాలజీని వాడటాన్ని ఖండించారు. అయితే ఈసారి విషయం హీరోయిన్ల ఫొటోల దగ్గర ఆగలేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరుతోనూ ఏఐ చిత్రాలు ప్రచారంలోకి రావడంతో ఆయన కూడా స్పందించారు.
మరోవైపు సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఇలా మహిళల ఫొటోలను మార్చేవాళ్లు తమ కుటుంబంలోని మహిళల విషయంలోనూ అదే పని చేస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మరిన్ని కఠినమైన చట్టాలు రాకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మరే అవకాశం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
