పెద్దితో రీజాయిన్ కానున్న జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
By: Tupaki Desk | 26 Jun 2025 10:53 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా జాన్వీకి సరైన హిట్ పడలేదు. దీంతో అమ్మడు టాలీవుడ్ పై కన్నేసి తెలుగు సినిమాలకు సైన్ చేసింది. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరలో నటించి ఆ సినిమా ద్వారా గ్రాండ్ టాలీవుడ్ డెబ్యూను అందుకుంది.
దేవర సినిమా రిలీజవక ముందే జాన్వీ మరో తెలుగు ఆఫర్ ను కూడా పట్టేసింది. తెలుగులో మొదటి సినిమాను ఎన్టీఆర్ తో చేసిన జాన్వీ రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది సినిమా రూపొందుతుంది.
ఉప్పెన సినిమా తర్వాతి నుంచి బుచ్చిబాబు తన టైమ్ మొత్తాన్ని ఈ కథపైనే ఇన్వెస్ట్ చేసి ఎంతో పకడ్బందీగా సినిమాను ప్లాన్ చేసుకోవడంతో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొన్నా మధ్య రిలీజైన పెద్ది ఫస్ట్ షాట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే పెద్ది షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది చిత్ర యూనిట్. అందుకే షూటింగ్ ను చక చకా చేసేస్తున్నారు. మొన్నటివరకు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో పెద్ది సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చేయగా నెక్ట్స్ షెడ్యూల్ ను ఢిల్లీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జులై 12 నుంచి హీరోయిన్ జాన్వీ పెద్ది షూటింగ్ లో రీజాయిన్ కానుండగా, ఆ సమయంలో జాన్వీపై కీలక సన్నివేశాలతో పాటూ రొమాంటిక్ సీన్స్, రెండు సాంగ్స్ ను కూడా షూట్ చేయనున్నారట. పెద్దికి సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాను బుచ్చిబాబు ఇంత త్వరగా పూర్తి చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 40 రోజుల షూటింగ్ అంటే సినిమా దాదాపు ఆఖరి దశకు వచ్చినట్టే. ఎలాగైనా సినిమాను ఆగస్టు లోపు పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ కేటాయించాలని డైరెక్టర్ బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.
