'పెద్ది' తర్వాత జాన్వీ లైనప్ షాకిస్తోందే
గుడ్ న్యూజ్, జగ్ జగ్ జీయో వంటి కమర్షియల్ చిత్రాల్ని అందించిన దర్శకుడు రాజ్ మెహతా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు.
By: Tupaki Desk | 28 May 2025 11:20 PM ISTటాలీవుడ్ లో వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ సరసన `దేవర`లో నటించిన జాన్వీ రామ్ చరణ్ సరసన `పెద్ది` అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఉప్పెన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పెద్ది తర్వాతా జాన్వీ లైనప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భామ కొంత గ్యాప్ తర్వాత మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన జాన్వీ కథానాయికగా నటిస్తుంది.
గుడ్ న్యూజ్, జగ్ జగ్ జీయో వంటి కమర్షియల్ చిత్రాల్ని అందించిన దర్శకుడు రాజ్ మెహతా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో దీనిని నిర్మించనుంది. `లాగ్ జా గేల్` అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో మొదటిసారి టైగర్ ష్రాఫ్ - జాన్వి కపూర్ జంటగా కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది.
జాన్వీ, టైగర్ ఇద్దరికీ కథ బాగా నచ్చింది. వెంటనే అంగీకరించారని కరణ్ తెలిపారు. ఇందులో భారీ యాక్షన్ కి ఆస్కారం ఉన్నా కానీ, లవ్ ఎలిమెంట్స్ ఎమోషన్స్ కి ఆస్కారం ఉందని వెల్లడించారు. చాలా చర్చల తర్వాత కథను ప్రతిబింబించేలా `లాగ్ జా గేల్` అనే టైటిల్‌ను ఎంచుకున్నారు. అరుదైన జోడీ.. అరుదైన కలయిక.. లవ్ స్టోరిలో హై-ఆక్టేన్ రివెంజ్ యాక్షన్ ప్రధాన ఆకర్షణలు.
ఈ చిత్రం 2025 చివరి నాటికి ప్రారంభం కానుంది. టైగర్ ష్రాఫ్ బాఘి 4 ప్రమోషన్స్ పూర్తి చేసుకుని తర్వాత జాన్వీతో షూటింగ్ ప్రారంభిస్తాడు. జాన్వీ కపూర్ తన రొమాంటిక్ కామెడీ `సన్నీ సంస్కారి కి తులసికుమారి` విడుదల ప్రచారం తర్వాత టీమ్ లో చేరనుంది. లాగ్ జా గేల్ 2026 ద్వితీయార్థంలో థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే హోమ్ బౌండ్ అనే కల్ట్ చిత్రంలో జాన్వీ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని కేన్స్ 2025 వేడుకల్లో ప్రీమియర్ వేయగా 10 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ లభించింది.
