కేన్స్ ఫెస్టివల్‌లో జాన్వీ సంతోషం, దుఃఖం
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి సారి జాన్వీ కపూర్ పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అక్కడ రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ వాక్ చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.
By: Tupaki Desk | 22 May 2025 1:22 PM ISTప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి సారి జాన్వీ కపూర్ పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అక్కడ రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ వాక్ చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్స్ అందమైన జాన్వీ కపూర్‌ను ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. జాన్వీ కపూర్ రెడ్ కార్పెట్‌పై లైట్ పింక్ డిజైనర్ ఔట్ ఫిట్‌లో చూడముచ్చటగా ఉంది. పెద్దగా స్కిన్ షో చేయకుండానే జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించింది అంటూ చాలా మంది కామెంట్ చేశారు. అందమైన జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ అనుభూతిని మీడియాతో పంచుకుంది.
జాన్వీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ వేడుకకి తాను తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి వచ్చాను. ఈ ఆనందకరమైన సందర్భంలో తన తల్లి పక్కన లేక పోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి అమ్మ ఎక్కువగా మమ్ములను కేన్స్‌కు తీసుకు వచ్చేవారు. వరుసగా నాలుగు సమ్మర్ హాలీడేస్‌లో మేము కేన్స్‌కి వచ్చినట్లుగా గుర్తు ఉంది. అలాంటి నేను ఈరోజు కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కుటుంబంతో కలిసి రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక్కడకు రావడం అనేది నాకు మాత్రమే కాకుండా నా మొత్తం ఫ్యామిలీకి కూడా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరం సంతోషంగా ఉన్నాం.
అమ్మ నటిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది, ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. అమ్మ విజయంలో కుటుంబంను భాగం చేసేవారు. అమ్మకు దక్కని గౌరవం, పురష్కారంకు సంబంధించిన వేడుకల్లో ఫ్యామిలీ మొత్తం కలిసి పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అలాగే ఈ అవార్డ్ వేడుకకి సైతం ఫ్యామిలీ మొత్తం కలిసి హాజరు అయ్యాం. నాతో పాటు నాన్న, చెల్లి ఉండటం ఎంత సంతోషంగా ఉందో, అమ్మ లేకపోవడం అంతే దుఃఖంగా ఉందని జాన్వీ కపూర్ ఎమోషన్ అయింది. ఈ సమయంలో అమ్మ ఉండి ఉంటే బాగుండేదని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అమ్మ కచ్చితంగా ఈ సమయంను ఎంజాయ్ చేసేవారు, నా విజయాన్ని ఆమె ఆనందించేవారు అంది. అమ్మను నేను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాను అంది.
జాన్వీ కపూర్ నటించిన 'హోమ్ బౌండ్' సినిమాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాన్వీ కపూర్ కేన్స్ లో సందడి చేసింది. ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో జాన్వీ ఆ సినిమాలో నటించింది. ఇప్పటివరకు ఎప్పుడూ, ఏ సినిమాలో కనబర్చని నటనను ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ కనబర్చింది అంటూ అదే కేన్స్ లో దర్శకుడు చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తెలుగులో జాన్వీ కపూర్ 'పెద్ది' సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీలోనూ జాన్వీ కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
