జన నాయగన్: వెనక్కి తగ్గిన నిర్మాతలు.. విడుదలకు లైన్ క్లియర్!
దీనికి తోడు ఇప్పటికే జననాయగన్ నిర్మాతలు ఈ చిత్రాన్ని సిబిఎఫ్సి రివైజింగ్ కమిటీకి పంపించినట్లు సమాచారం.
By: Madhu Reddy | 11 Feb 2026 12:56 PM ISTజన నాయగన్.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న ఈ సినిమాకు హెచ్.వినోత్ దర్శకత్వం వహించారు. కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ కారణంగా వాయిదా పడింది.. ఇక అప్పటినుండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కి అలాగే చిత్ర నిర్మాతలకి మధ్య జరిగిన చట్టపరమైన వాగ్వాదం ఎంతకు దారితీసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వివాదం కాస్త ముగిసింది. నిర్మాతలు CBFC పై వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి చిత్ర బృందానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు కెవిఎన్ ప్రొడక్షన్ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది విజయన్ సుబ్రహ్మణ్యం కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాశారు. అందులో "సినిమాను మరోసారి రివైజింగ్ కమిటీకి పంపి, సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. సి బి ఎఫ్ సి కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటాము. ఇకపై చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదు" అంటూ నిర్మాతలు లేఖలో పేర్కొన్నారు. ఇక దీంతో ఈ అభ్యర్థనను జస్టిస్ పిటి ఆశ పరిశీలించి నిర్మాతల అభ్యర్థనకు అనుమతి ఇచ్చారు. దీంతో సిబిఎఫ్సి కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకోవడం వల్లే సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
దీనికి తోడు ఇప్పటికే జననాయగన్ నిర్మాతలు ఈ చిత్రాన్ని సిబిఎఫ్సి రివైజింగ్ కమిటీకి పంపించినట్లు సమాచారం. ఇక త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జన నాయగన్ సినిమా విడుదలకు ఇప్పుడు లైన్ క్లియర్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయానికొస్తే ఈ సినిమాను ప్రకటించినప్పుడే ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేక్ అంటూ ప్రచారం జరిగింది.
కానీ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఈవెంట్ మలేషియాలో జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ వినోద్ మాట్లాడుతూ.. ఇది 90% భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ కాదు అంటూ స్పష్టం చేశారు. కానీ ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ ఇది భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని స్పష్టంగా అర్థం అయ్యేలా చేసింది. ఇకపోతే ఇప్పుడు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరొకవైపు తమిళనాడులో ఎన్నికల డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అటు విజయ్ దళపతి కూడా తాను పెట్టిన టీవీ కే పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పలుచోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ.. తమ పార్టీని ప్రజలలో బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో..ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం ఎన్నికల తేదీ వెలువడిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. మమిత బైజు, బాబి డియోల్ కీలక పాత్రలు పోషించారు.
