జన నాయగన్ ఇష్యూ.. మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్..
జన నాయగన్ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ అధికారిక లీగల్ నోటీసు విడుదల చేశారు.
By: M Prashanth | 10 April 2026 5:01 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం జన నాయగన్ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఆన్ లైన్ లో లీక్ కావడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆ ఘటనపై మూవీ టీమ్ స్పందిస్తూ, లీకైన కంటెంట్ ను ఎవ్వరూ షేర్ చేయవద్దని, సర్క్యులేట్ చేయవద్దని క్లియర్ గా హెచ్చరించింది. ఈ మేరకు అఫిషియల్ గా లీగల్ నోటీస్ ను విడుదల చేసింది.
జన నాయగన్ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ అధికారిక లీగల్ నోటీసు విడుదల చేశారు. ఆ నోటీసులో సినిమాకు చెందిన సన్నివేశాలను కొందరు చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సినిమా కమర్షియల్ సక్సెస్ పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
లీకైన వీడియోలను డౌన్లోడ్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం, అప్లోడ్ చేయడం లేదా రీపోస్ట్ చేయడం మాత్రమే కాదు, వాటిని స్టార్ చేసుకోవడం కూడా కాపీరైట్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. అలాంటి చర్యల్లో ఒక్క దానికి పాల్పడినా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పటికే లీక్ కు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న వారిని ట్రాక్ చేసి గుర్తించి, వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులు బాధ్యతగా వ్యవహరించి లీక్ కంటెంట్ ను చూడకూడదని, షేర్ చేయకూడదని నిర్మాణ సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా.. జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఆ సినిమా మొదట ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో పాటు సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రాలేదు.
ఇంతలోనే సినిమాకు చెందిన సన్నివేశాలు లీక్ అవ్వడం చిత్రబృందానికి పెద్ద షాక్ గా మారింది. ముఖ్యంగా పెద్ద హీరో సినిమా కావడంతో పైరసీ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందుకే మేకర్స్ వెంటనే అప్రమత్తమై, లీగల్ చర్యలకు దిగారు. సినిమా పరిశ్రమకు పైరసీ ఒక పెద్ద సమస్యగా మారుతున్న నేపథ్యంలో జన నాయగన్ ఘటన మరోసారి దాని ఎఫెక్ట్ ను గుర్తు చేసింది. నిర్మాతలు, దర్శకులు ఎంతో కష్టపడి రూపొందించే సినిమాలను ఇలాంటి లీకులు నష్టపరుస్తున్నాయని చెప్పాలి. కాబట్టి ప్రేక్షకులు బాధ్యతతో వ్యవహరించి పైరసీకి దూరంగా ఉండాలని, థియేటర్లలోనే సినిమాలను ఆస్వాదించాలని మేకర్స్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
