అగ్ర హీరో మమ్మల్ని అలా దెబ్బ కొట్టాడు!
బిజెపి నాయకుడు సురేష్ గోపి ఇంకా ఈ సమస్యను బహిరంగంగా ఎందుకు ప్రస్తావించలేదో కూడా వెల్లడించారు.
By: Tupaki Desk | 7 July 2025 10:45 PM ISTజానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ టైటిల్ వివాదాస్పదం కావడంతో సినిమా రిలీజ్ కి అడ్డంకులేర్పడ్డాయి. ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ జరుగుతోంది. టైటిల్ నుంచి జానకి అనే పేరును తొలగించాలనేది ప్రత్యర్థి వాదన.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) జానకి పేరును టైటిల్ నుంచి అలాగే సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేయడంతో `జానకి వర్సెస్ కేరళ స్టేట్ ( జెఎస్‌కె) విడుదల సందిగ్ధంలో పడింది. కానీ నిర్మాతలు సెన్సార్ కోరిన ఆ మార్పు చేయడానికి నిరాకరించారు. మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ నటుడు-రాజకీయ నాయకుడు సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మద్దతు ఇచ్చింది.
అయితే ఇప్పటివరకూ ఇదంతా బాగానే ఉన్నా కానీ, వివాదంపై ఇంకా సురేష్ గోపి బహిరంగంగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు చిత్ర నిర్మాత సురేష్ కుమార్ జెఎస్‌కె వివాదంపై స్పందించారు. బిజెపి నాయకుడు సురేష్ గోపి ఇంకా ఈ సమస్యను బహిరంగంగా ఎందుకు ప్రస్తావించలేదో కూడా వెల్లడించారు.
సురేష్ గోపి తన సినిమా రిలీజ్ ఆగిపోయినందుకు చాలా కోపంగా ఉన్నారు. కానీ ఆయన కేంద్ర సహాయ మంత్రి కాబట్టి స్పందించడానికి పరిమితులు ఉన్నాయి! అని నిర్మాత సురేష్ కుమార్ వివరించారు. వారు అతని తరపున ఈ సమస్యను వినిపిస్తున్నారని అన్నారు. ఆర్టిస్టుల సంఘం -అమ్మ, FEFKA వంటి మలయాళ చిత్ర సంఘాలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఒక మెమోరాండం సమర్పించాయని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని నిర్మాత సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాని హైకోర్టు న్యాయమూర్తి ఎన్ నాగరేష్ వీక్షించారు. బుధవారం నాడు మళ్లీ ఈ కేసు పునఃపరిశీలనకు రానుంది.
తాజా ఇంటర్వ్యూలో నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ.. తమ చిత్రం ఈపాటికే విడుదలై ఉండేది కానీ మా సినిమా రిలీజ్ సమయంలోనే `ఎల్ 2- ఎంపూరన్` విడుదలైందని, ఆ సినిమా సెన్సార్ గడపపై వివాదంలో చిక్కుకోవడం, అటుపై సెన్సార్ సభ్యులు ప్రతిదీ తరచి తరచి చూస్తుండడంతో ఇప్పుడు మా సినిమాకి అది పెద్ద దెబ్బ కొట్టిందని సురేష్ కుమార్ అన్నారు. సెన్సార్ సభ్యులు ఇప్పుడు ప్రతిదీ ఆచితూచి ఆలోచిస్తున్నారు. సెన్సార్ ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని కూడా సురేష్ అన్నారు. ఎల్ ఎంపూరన్ సమస్యల్లో చిక్కుకోవడంతోనే తమ సినిమా కూడా చిక్కుల్లో పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
