Begin typing your search above and press return to search.

సెన్సార్ చిక్కుల్లో అనుప‌మ సినిమా

ఇప్పుడు సురేష్ గోపి - అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ కోర్టు రూమ్ డ్రామా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' థియేటర్లలో విడుదలకు ముందు సీబీఎఫ్‌సి నుంచి చిక్కుల్ని ఎదుర్కొంది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:56 AM IST
సెన్సార్ చిక్కుల్లో అనుప‌మ సినిమా
X

ఇటీవ‌లే మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `సీతారే జ‌మీన్ పార్`లో రెండు స‌న్నివేశాల్ని స‌వ‌రించాల‌ని సీబీఎఫ్‌సి కండీష‌న్ పెట్ట‌గా, అమీర్ ఖాన్ స‌సేమిరా అన్నారు. క‌ట్స్ లేకుండానే స‌ర్టిఫికెట్ జారీ చేయాల‌ని అతడు మొండి ప‌ట్టు ప‌ట్టాడు. ప‌ర్య‌వ‌సానంగా సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతుంద‌ని పుకారు వ‌చ్చినా చివ‌రికి మ్యానేజ్ చేసారు.

ఇప్పుడు సురేష్ గోపి - అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ కోర్టు రూమ్ డ్రామా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' థియేటర్లలో విడుదలకు ముందు సీబీఎఫ్‌సి నుంచి చిక్కుల్ని ఎదుర్కొంది. ఈ సినిమా టైటిల్ లో `జానకి` అనే పేరును ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాన‌కి హిందూ దేవ‌త పేరు. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుంది గ‌నుక స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేమ‌ని సీ.బీ.ఎఫ్.సి పేర్కొంది.

జాన‌కి బ‌దులుగా అనుప‌మ అని పేరును మార్చుకోవాల‌ని కూడా సీబీఎఫ్‌సి అధికారులు సూచించార‌ట‌. కానీ దీనిని మార్చేందుకు చిత్ర‌నిర్మాత‌లు నిరాక‌రించారు. ఫలితంగా సినిమా విడుదలకు బ్రేక్ ప‌డింది. ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో లేదో అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఫెఫ్కా కార్య‌ద‌ర్శి సీబీఎఫ్‌సి నిర్ణ‌యాన్ని క్రియేటివిటీపై దాడిగా పేర్కొన్నారు. జాన‌కి అనే పేరుగ‌ల వారంద‌రినీ నిషేధిస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. నింద మోప‌బ‌డిన‌ యువ బాధితురాలి త‌ర‌పున పోరాడే లాయ‌ర్ గా సురేష్ గోపి ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. కోర్ట్ రూమ్ డ్రామా పూర్తిగా ఉద్వేగంతో కూడుకున్న‌ది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో ప‌డింది.