'జైలర్ 2' తెలుగుకి అంత సీన్ ఉందా..?
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుంది.
By: Tupaki Desk | 21 April 2025 7:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చేసింది. ఆగస్టులో కూలీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, చాలా తక్కువ సమయంలోనే 'జైలర్ 2' సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుంది. దాంతో జైలర్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. జైలర్ 2 సినిమాను తెలుగులో డబ్ చేసేందుకు ప్రముఖ నిర్మాతలు ఆసక్తగా ఉన్నారు.
రజనీకాంత్‌కి ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. తమిళనాడు లో మాదిరిగా తెలుగులోనూ ఆయన సినిమాలు భారీ వసూళ్లు నమోదు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే గత దశాబ్ద కాలంగా తమిళనాట మంచి వసూళ్లు సాధించిన సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టలేక పోయాయి. జైలర్ సినిమా తెలుగు మార్కెట్‌లో దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు వార్తలు వచ్చాయి. అందుకే జైలర్ 2 సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు జైలర్ 2 కి ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయట.
సన్ పిక్చర్స్ వారు మాత్రం జైలర్ 2 తెలుగు డబ్బింగ్ రైట్స్ పై చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు నిర్మాతల నుంచి వస్తున్న ఆఫర్లను వారు సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారట. ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా జైలర్ 2 తెలుగు డబ్బింగ్ రైట్స్ ను ఇచ్చేందుకు స్పందించడం లేదంటే కచ్చితంగా వారు మరింత భారీ మొత్తాన్ని ఆశిస్తూ ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జైలర్ 2 తెలుగు రైట్స్ ద్వారా రూ.100 కోట్లు రాబట్టాలని సన్ పిక్చర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జైలర్ సినిమాకు ఎలాగూ వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. కనుక జైలర్ 2 అంతకు మించి వసూళ్లు రాబట్టడం ఖాయం అని వారు భావిస్తూ ఉండవచ్చు.
రజనీకాంత్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని, అంచనాలను కలిగి ఉన్నాయి. అయితే జైలర్ 2 సినిమా రూ.100 కోట్ల మార్కెట్ కలిగి ఉందా అంటే కచ్చితంగా అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. జైలర్ 2 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సన్ పిక్చర్స్ నేరుగా రిలీజ్ చేస్తే కచ్చితంగా నష్టం తప్పదు. ఇక్కడి పెద్ద నిర్మాణ సంస్థలకు పంపిణీ బాధ్యత అప్పగిస్తే తప్ప బిగ్ రిలీజ్ దక్కదు. కనుక జైలర్ 2 ను ఓన్ రిలీజ్ చేయడం కంటే డబ్బింగ్ హక్కులు విక్రయించడం తెలివైన నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రజనీకాంత్ మార్కెట్‌ను, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
