Begin typing your search above and press return to search.

'జైలర్ 2' మూవీ రివ్యూ

విగ్రహాల స్మగ్లింగ్ చేసే వర్మతో పాటు అతడితో చేతులు కలిపిన తన కొడుకును కూడా చంపేసిన ముత్తువేల్ పాండ్యన్ (రజినీకాంత్).. తిరిగి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు.

By:  Tupaki Desk   |   15 Oct 2026 12:28 PM IST
జైలర్ 2 మూవీ రివ్యూ
X

'జైలర్ 2' మూవీ రివ్యూ

నటీనటులు: రజినీకాంత్ - ఎస్.జె.సూర్య - సూరజ్ వెంజరమూడు - విద్యా బాలన్ - మిథున్ చక్రవర్తి - రమ్యకృష్ణ - మిర్ణ మీనన్ - యోగిబాబు - నమో నారాయణ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్

నిర్మాత: కళానిధి మారన్

రచన - దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

మూడేళ్ల ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేసిన సినిమా.. జైలర్. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్-2 ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

విగ్రహాల స్మగ్లింగ్ చేసే వర్మతో పాటు అతడితో చేతులు కలిపిన తన కొడుకును కూడా చంపేసిన ముత్తువేల్ పాండ్యన్ (రజినీకాంత్).. తిరిగి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. వర్మ తమ్ముడైన దిలీప్ (సూరజ్ వెంజరమూడు) తన అన్నను చంపిన వ్యక్తి కోసం వెతుకుతాడు. కానీ ముత్తువేల్ పాండ్యనే.. దిలీప్ కి దగ్గరై అతడి ద్వారా ఒక పని పూర్తి చెయ్యాలని అనుకుంటాడు. ఇంతకీ ముత్తువేల్ టార్గెట్ ఏంటి.. ఆయన చెప్పిన పని దిలీప్ చేశాడా.. విగ్రహాల మాఫియా వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు ఎవరు.. వాళ్ళతో ముత్తువేల్ గొడవ ఎక్కడిదాకా వెళ్ళింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరోను విలన్ గ్యాంగ్ చుట్టుముడుతుంది. హీరో పనైపోయిందని అంతా అనుకుంటారు. విలన్ వికటాట్టహాసం చేస్తాడు. కానీ హీరోలో రవ్వంత కూడా భయం ఉండదు. పైగా ఒక వెటకారపు నవ్వు నవ్వుతాడు. కట్ చేస్తే.. విలన్ చుట్టూ ఉన్న గ్యాంగ్ అంతా వాషౌట్ అయిపోతుంది. తన గేమ్ లోకి హీరో వచ్చాడని విలన్ అనుకుంటే.. హీరో ఆడే ఆటలో విలనే పావు అని తేలుతుంది. మాస్ హీరోల కమర్షియల్ సినిమాల్లో దశాబ్దాల నుంచి చూస్తున్న ఎలివేషన్ సెటప్ ఇది. ఇలాంటి సెటప్ అందరికంటే బాగా కుదిరేది సూపర్ స్టార్ రజినీకాంత్ కే. ఆయన సినిమాల్లో ఇలాంటి ఎపిసోడ్లు ఎన్నిసార్లు చూసి ఉంటామో లెక్కలేదు. ‘జైలర్’ మొత్తం ఇలాంటి సీన్లే పెట్టి ఎలివేషన్ల జాతర చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్-2’లో కూడా అతను కొత్తగా చేసిందేమీ లేదు. చాలాసార్లు రజినీని ఊరికే అలా నిలబెట్టాడు.. అప్పుడప్పుడూ ఆయనతో సింపుల్ గా స్మైల్ ఇప్పించాడు.. చిన్న చిన్న డైలాగులు చెప్పించాడు.. కొన్నిసార్లు స్లో మోషన్లో నడిపించాడు.. కానీ ఎలివేషన్ సరిగా పండేలా సన్నివేశాలు రాసుకోవడం.. వాటికి అనిరుధ్ బీజీఎం కూడా తోడవడంతో సూపర్ స్టార్ అభిమానులు కోరుకునే వినోదానికి ఢోకా లేకపోయింది. అలాగే నెల్సన్ నుంచి ఆశించే ఫన్ కూడా ఒక దశ వరకు బాగానే వర్కవుట్ అయింది. కానీ ఈ ఎలివేషన్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు.. అంతకుమించి సినిమాలో విశేషం ఏముంది అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం. రొటీన్ అనిపిస్తూనే పైసా వసూల్ అనిపించే ఎంటర్టైనర్ ‘జైలర్-2’.

‘జైలర్-2’ను ప్రాపర్ సీక్వెల్ గానే తీర్చిదిద్దాడు నెల్సన్. ‘జైలర్’ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుంది. వర్మతో పాటు తన కొడుకునూ చంపేశాక.. ముత్తువేల్ పాండ్యన్ మళ్లీ ఫ్యామిలీ మ్యాన్ అవతారం ఎత్తుతాడు. కానీ అతడి వల్ల దెబ్బ తిన్న విగ్రహాల మాఫియా ముత్తువేల్ కోసం వెతుకుతుంటే.. ముత్తువేల్ ఎలా కౌంటర్ ఎటాక్ చేసి శత్రు శేషం లేకుండా చేశాడన్నదే ఈ కథ. ఆల్రెడీ ‘జైలర్’లో హీరో పాత్రేంటి.. తన బలమేంటి.. బలగమేంటి.. ఈ కథ సెటప్ ఏంటి అని అర్థం అయిపోయాక.. ‘జైలర్-2’ స్టోరీ ఏంటో ట్రైలర్లోనే విప్పేశాక.. ప్రేక్షకులను కొత్తగా సర్ప్రైజ్ చేయడానికి ఏమీ ఉండదు. అయినా అలవాటైన సెటప్ లోనే వీలైనంత మేర వినోదాన్ని పండించాడు దర్శకుడు. ‘జైలర్’లో యోగిబాబు ఒక్కడే ఉంటే.. ఈసారి నమో నారాయణ రూపంలో ఇంకో డంబ్ క్యారెక్టర్ని పెట్టి.. వీళ్లిద్దరినీ ఉపయోగించుకుని జైలర్ ఆడే ఆట నేపథ్యంలో నెల్సన్ వినోదాన్ని పండించాడు. తొలి గంటలో వీళ్లిద్దరి కామెడీ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. కామెడీ వరకు చూస్తే ‘జైలర్’ను మించి వినోదాన్ని ఇస్తుంది ‘జైలర్-2’. నెల్సన్ మార్కు సటిల్ సెటైరిక్ కామెడీ తొలి గంటలో బాగా వర్కవుట్ అయింది. దీనికి తోడు మూడు పేలిపోయే ఎలివేషన్ ఎపిసోడ్లతో రజినీ అభిమానులకు కావాల్సిన స్టఫ్ ఇచ్చేశాడు నెల్సన్. ముఖ్యంగా ఎన్నోసార్లు చూసిన వ్యవహారంలాగే అనిపించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా పేలింది.

ఐతే మొత్తం సినిమాను కేవలం ఎలివేషన్లతోనే నడిపించడం కష్టం కదా. కథలో ఏదో ఒక మలుపుండాలి కదా.. సర్ప్రైజులేవో పెట్టాలి కదా.. ఆ దిశగా ఏమీ ఆలోచించలేదు నెల్సన్. హీరోను విలన్లు ఫిక్స్ చేసినట్లే కనిపిస్తారు.. కానీ చివరికి హీరోనే పైచేయి సాధిస్తాడు.. సీన్ తర్వాత సీన్ ఇలాగే నడుస్తూ పోతుంటుంది. ఇక చాలు మహాప్రభో అనే లెవెల్లో ఒకదాని తర్వాత ఒకటి ఎలివేషన్ సీన్లు వస్తుంటాయి. పేరుకేమో బోలెడంత మంది విలన్లుంటారు. కానీ అందులో ఎవ్వరూ హీరోను రవ్వంతైనా ఇబ్బంది పెట్టరు. ఏ విలన్ని చూసినా అటు హీరోకు కానీ.. ఇటు ప్రేక్షకులకు కానీ రవ్వంతైనా కంగారుగా అనిపించదు. ఒక సీన్లో విలన్లను కాస్త పైకి లేపడం- ఆ వెంటనే కింద పడేయడం.. హీరో సమస్యల్లో పడ్డట్లు కనిపించడం- వెంటనే అతను పైచేయి సాధించడం.. హీరోకు అసలు ఎదురే లేదన్నట్లుగా సినిమాను నడిపించడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. ‘జైలర్’ సినిమాలో హీరో పాత్రలో అనేక లేయర్స్ ఉంటాయి. సామాన్యుడిగా పరిచయం కావడం.. ఆ తర్వాత జైలర్ అవతారం ఎత్తడం.. ఆపై అతడి వెనుక ఉండే నెట్వర్క్.. ఇలా పాత్ర తాలూకు షేడ్స్ మారుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతాయి. కానీ ఇక్కడ అదంతా అలవాటైన వ్యవహారం అయిపోవడంతో కొత్తగా-సర్ప్రైజింగ్ గా ఏమీ అనిపించదు. క్యామియోలు రొటీన్ అనిపిస్తాయి. కొంచెం ఫోర్స్డ్ ఫీలింగ్ కూడా కలిగిస్తాయి. ఎంతో ఊహించుకున్న హృతిక్ క్యామియో పెద్దగా కిక్కు ఇవ్వలేకపోయింది. ద్వితీయార్ధంలో కథకు కొంచెం ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ప్రథమార్ధంలో మాదిరి కామెడీ లేకపోవడం కూడా ద్వితీయార్ధానికి మైనస్ అయింది. ‘జైలర్’ తరహాలోనే క్యామియోల మెడ్లీ.. ఒక భారీ ఎలివేషన్ తో సినిమాను ముగించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘జైలర్-2’ ఫుల్ లెంత్ రజినీ నుంచి ఆశించే ఎలివేషన్లు.. నెల్సన్ నుంచి కోరుకునే కామెడీతో పైసా వసూల్ అనిపించే ఎంటర్టైనరే. అంతకుమించి ఎక్కువ ఆశిస్తేనే కష్టం.

నటీనటులు:

రజినీకాంత్ తనకు బాగా అలవాటైందే ఈ సినిమాలో కూడా చేశాడు. తనదైన స్టైల్.. స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానులను అలరించాడు. ఫిజికల్ గా పెద్దగా ఏమీ చేయకుండానే మాస్ సీన్లను పండించడం.. గూస్ బంప్స్ తీసుకురావడం ఆయనకే చెల్లు. ఎస్.జె.సూర్య విలనీలో కొత్తదనం ఏమీ లేదు. ఇంతకుముందు తన నటన కొత్తగా ఉండేది కానీ.. ఇప్పుడు రొటీన్ అనిపిస్తుంది. సూరజ్ వెంజరమూడు గెటప్ భలే ఉంది. తన నటన కూడా ఓకే కానీ.. తన పాత్ర సాధారణంగా అనిపిస్తుంది. అతణ్ని నెల్సన్ సరిగా ఉపయోగించుకోలేదు. తన పాత్రను మధ్యలో తేల్చిపడేశాడు. కాంత పాత్రలో విద్యాబాలన్ ఆకట్టుకుంది. మిథున్ చక్రవర్తి పర్వాలేదు. యెగిబాబు.. నమో నారాయణ ఇద్దరూ కామెడీతో అలరించారు. రజినీ తర్వాత సినిమాలో హైలైట్ వీళ్లిద్దరే. రమ్యకృష్ణ.. మిర్ణా వీళ్ల పాత్రలు మామూలే. శివరాజ్ కుమార్.. మోహన్ లాల్.. జాకీష్రాఫ్ క్యామియోలు ఓకే. హృతిక్ రోషన్ క్యామియో వల్ల కొత్తగా సినిమాకు యాడ్ అయిందేమీ లేదు.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ రవిచందర్ మరోసారి అడ్రినలిన్ రష్ ఇచ్చే బీజీఎంతో ‘జైలర్-2’కు పెద్ద బలంగా నిలిచాడు. ఎలివేషన్ సీన్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడంలో అనిరుధ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. కాకపోతే తన బీజీఎంలో కొత్తదనం అయితే లేదు. ‘జైలర్’లోని హుకుం బీజీఎంనే చాలాచోట్ల రిపీట్ చేశాడు. అది వర్కవుట్ అయింది కూడా. కానీ కొత్తగా ఈ సినిమా కోసం చేసిన పాటలు మాత్రం పెద్దగా కిక్కు ఇవ్వవు. కెమెరామన్ విజయ్ కార్తీక్ కన్నన్ కలర్ ఫుల్ విజువల్స్ లో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సన్ పిక్చర్స్ స్థాయికి తగ్గట్లే రిచ్ గా తీశారు సినిమాను. రైటర్ కమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ‘జైలర్’ టెంప్లేట్ నే కొనసాగిస్తూ ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో సినిమాను నడిపించాడు. కథ పరంగా అతను సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ జోడించలేదు కానీ.. సినిమాను బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. ప్రథమార్ధంలో ఉన్న నెల్సన్ మార్కు కామెడీ రెండో అర్ధంలో కూడా ఉండి.. కథ మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే ‘జైలర్-2’ లెవెల్ వేరుగా ఉండేది. అయినప్పటికీ ఒకసారి చూడ్డానికి ఇది ఢోకా లేని సినిమానే.

చివరగా: జైలర్-2.. అదే సెటప్.. అయినా ఎంటర్టైన్మెంట్

రేటింగ్ - 2.75/5