జైలర్ 2 లోనూ వివాదాస్పద వర్మ...!
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో 'జైలర్' సినిమాకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.
By: Tupaki Desk | 25 May 2025 6:00 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో 'జైలర్' సినిమాకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. రజనీ సర్ కెరీర్ ఖతం అంటూ ప్రచారం జరిగిన సమయంలో వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించినట్లు వసూళ్లను దక్కించుకుంది. దాంతో రజనీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లుగా వరుస సినిమాలు చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. జైలర్ సినిమా సూపర్ హిట్ నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. రజనీకాంత్ కూడా తనకు జైలర్ ఇచ్చిన విజయం నేపథ్యంలో సీక్వెల్‌పై ఆసక్తి కనబర్చడం, షూటింగ్ ప్రారంభం కావడం అంతా చకచకా జరిగి పోయిన విషయం తెల్సిందే.
జైలర్ 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే ఈ సీక్వెల్‌లో తెలుగు పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ కనిపించబోతున్నారనే వార్తలు వచ్చాయి. 10 నిమిషాలు జైలర్ 2 లో కనిపించడం కోసం బాలకృష్ణ రికార్డ్ స్థాయి పారితోషికం డిమాండ్ చేశారని, ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత, బాలయ్య ఉన్న ఫామ్ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఆ భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పారని, త్వరలోనే ఏపీలో షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. రజనీకాంత్, బాలకృష్ణ కాంబో సన్నివేశాలు ఉంటాయా లేదా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఆ విషయం పక్కన పెడితే జైలర్ సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే.
రజనీకాంత్, వర్మ పాత్రలో కనిపించిన వినయకన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. విలన్ వర్మ పాత్రలో వినయకన్ నటించిన తీరుకు విమర్శకులు సైతం వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. జైలర్ విజయంలో ఈయనది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అందుకే జైలర్ 2 లోనూ ఈయన ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేకర్స్ కొన్ని నిమిషాల పాటు ఆయన్ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జైలర్ సినిమాలో వర్మ చనిపోయినట్లుగా చూపించారు. కనుక సీక్వెల్‌లో ఆయన పాత్ర ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ దర్శకుడు నెల్సన్ దిలీప్ ఒక సీన్‌లో భాగంగా ఫ్ల్యాష్ బ్యాక్‌కి తీసుకు వెళ్లి మరీ వర్మను మరోసారి వెండి తెరపై జైలర్ 2 కోసం తీసుకు రాబోతున్నాడు.
తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2లోని వర్మ పాత్ర కోసం వినయకన్ రెండు రోజుల పాటు షూట్‌లో పాల్గొన్నాడు. అవసరం అయితే మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఆయన షూట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ మధ్య తాగి గొడవ చేసిన కేసులో పోలీసులు వినయకన్‌ను అరెస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. జైలర్ 2 లో ఈ వివాదాస్పద నటుడు ఉండటం అదనపు ఆకర్షణ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే, ఈ తాగుబోతు మళ్లీ జైలర్ సినిమాలో కనిపించడం అవసరమా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి జైలర్ 2 లో పలువురు ప్రముఖులు కనిపించబోతున్నారు. భారీ స్టార్ కాస్ట్‌తో జైలర్ 2 పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
