Begin typing your search above and press return to search.

ఘట్టమనేని న‌ట‌వార‌సుడు ఎక్కడికి వెళ్లినా వెంటాడుతున్న 'జై బాబు'

తెలుగు చిత్రసీమలో ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   13 July 2026 8:37 AM IST
ఘట్టమనేని న‌ట‌వార‌సుడు ఎక్కడికి వెళ్లినా వెంటాడుతున్న జై బాబు
X

తెలుగు చిత్రసీమలో ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్న సంగ‌తి తెలిసిందే. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగ‌త‌ రమేష్ బాబు కుమారుడు- మహేష్ బాబు క‌జిన్ జయకృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `శ్రీనివాస మంగాపురం` ద్వారా ఈ యువ‌హీరో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ డెబ్యూ చేస్తుండగా, సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మిస్తూ, అశ్వినీదత్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విజయవాడలో ఘనంగా విడుదల చేశారు.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం యువ నటుడు జయకృష్ణ ఎక్కడికి వెళ్లినా... స్టేజ్ ఎక్కినా అభిమానుల నుండి `జై బాబు` నినాదాలు నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. జయకృష్ణ తన బాబాయ్ మహేష్ బాబు పేరు ఎత్తగానే ఫ్యాన్స్ థియేటర్లు, ఈవెంట్ ప్రాంగణంలో `జై బాబు` అంటూ గగ్గోలు పెడుతూ భారీ హంగామా చేస్తున్నారు. అభిమానుల కోలాహలం మధ్య విజ‌య‌వాడ ప్ర‌మోష‌న్స్ (ట్రైల‌ర్ లాంచ్) లో జయకృష్ణ నేరుగా మ‌హేష్ ఫ్యాన్స్ నుంచి హీట్ ని ఎదుర్కొన్నారు. ఈవెంట్లో యువ‌హీరో మాట్లాడుతూ.. తన బాబాయ్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి షూటింగ్ ముగిసే వరకు తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారని చెబుతూ.. ఆయ‌న‌కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కంటెంట్ ప్రతిదీ మహేష్ బాబు స్వయంగా చూసి, వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూ తమ వెన్నంటి నిలిచారని జయకృష్ణ ఎంతో సంతోషంగా తెలిపారు.

ఈ వేడుకలో జయకృష్ణ తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన తాతగారు సూపర్ స్టార్ కృష్ణ గారే తనకు దేవుడని, ఆయన లేకపోతే ఈరోజు తాను ఇక్కడ ఉండేవాడినే కాదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తన తండ్రి స్వర్గీయ రమేష్ బాబు గారిని తలచుకుంటూ.. ఈరోజు నాన్న బతికి ఉండి ఉంటే నా ట్రైలర్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారని.. ఆయన ఎక్కడున్నా సరే సంతోషంగానే ఉంటారని భావిస్తున్నట్లు చెప్తూ కళ్లు చెమర్చారు. జయకృష్ణ తన తండ్రి గురించి చెబుతున్నప్పుడు అక్కడున్న వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి యువ‌హీరో ఎమోష‌న్ ని అర్థం చేసుకున్నారు.

సినిమా సాంకేతిక నిపుణుల గురించి జయకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. దర్శకుడు అజయ్ భూపతి అద్భుతమైన ఎమోషన్స్, బలమైన క్యారెక్టర్లతో ఒక వండర్‌ఫుల్ లవ్ స్టోరీని రాశారని.. ఇది యువతకు .. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ స్క్రీన్ మీద సరికొత్త విజువల్ అనుభవాన్ని ఇస్తాయని చెప్పారు. లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో చేసిన అద్భుతమైన పాత్ర చిత్రానికి పెద్ద అసెట్ అని.. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు.

మరోవైపు ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు వారణాసి పోస్టర్లు, సినిమా గురించిన కామెంట్లతో అభిమానులు భారీగా సందడి చేశారు. ఇదే ఉత్సాహంతో త్వరలోనే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలను కూడా అధికారికంగా ప్రకటిస్తామని జయకృష్ణ వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ ప్రతిష్టాత్మక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని జయకృష్ణ స్పష్టం చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త‌న మాట‌ల మ‌ధ్య‌లో ఫ్యాన్స్ డిమాండ్ మేర‌కు `జై బాబు` అంటూ నిన‌దించారు జ‌య‌కృష్ణ‌. ట్రైల‌ర్ ఈవెంట్లో అజ‌య్ భూప‌తి, రాషా త‌డానీ, ఆది శేష‌గిరిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.