Begin typing your search above and press return to search.

అభిమాన సంఘాలు ట్రస్ట్‌తో జ‌గ‌ప‌తి తెగ‌తెంపులు

తన నోట్‌లో జగపతి బాబు చాలా మంది అభిమానుల కుటుంబాలకు ఆసరాగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:32 PM GMT
అభిమాన సంఘాలు ట్రస్ట్‌తో జ‌గ‌ప‌తి తెగ‌తెంపులు
X

హీరో ట‌ర్న్‌డ్ విలన్ జ‌గ‌ప‌తి బాబు హ‌ర్ట‌య్యారు. కొంద‌రు అభిమానుల నిర్వాకం దీనికి కార‌ణం. ఆయ‌న‌ స్వయంగా ఈ రోజు ఒక ట్వీట్‌తో ఊహించ‌ని ట్విస్టిచ్చారు. ఇక‌పై అభిమానుల సంఘాలు, ట్ర‌స్ట్ తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఖ‌రాకండిగా చెప్పారు. ఇది బాధాక‌ర‌మే అయినా కానీ అభిమాన సంఘాల‌తో సంబంధాలు కొన‌సాగ‌వ‌ని ప్ర‌క‌టించారు.


తన నోట్‌లో జగపతి బాబు చాలా మంది అభిమానుల కుటుంబాలకు ఆసరాగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. ఇప్పుడు వారిలో ఎక్కువ మంది త‌న‌ నుండి కేవలం ప్రేమ మాత్ర‌మే కాకుండా అంత‌ కంటే ఎక్కువగా 'ఆశించడం' ప్రారంభించార‌ని అన్నారు. అభిమానుల సంఘాలు తనకు అసౌకర్యం కలిగించే స్థాయికి చేరుకున్నాయని చెబుతూ, జగపతి బాబు అభిమానుల సంఘాలతో, అలాగే ట్రస్ట్‌తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం అభిమానించే - ప్రేమించే అభిమానులతో తాను ఎప్పుడూ ఉంటానన్న వాస్తవాన్ని నొక్కి చెబుతూ జగపతి బాబు 'జీవించండి.. జీవించనివ్వండి' అని నోట్‌ను ముగించారు.

నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఏ హీరో నుంచి ఊహించ‌నిది. కానీ జ‌గ‌ప‌తిబాబు సూటిగా త‌న మ‌న‌సుకు తోచిన‌ది చేసారు. ప్రాక్టిక‌ల్ గా స్పందించారు. అయితే అభిమానులు ప్రేమ‌ను మించి త‌న నుంచి ఏం ఆశిస్తున్నారు? అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ట్ర‌స్ట్ పేరుతో అత‌డికి ఏమైనా ఇబ్బందులు క‌లిగిస్తున్నారా? అన్న‌దానిపైనా ఆరాలు మొద‌ల‌య్యాయి.

జ‌గ‌ప‌తి బాబు విల‌న్ గా స‌హాయ న‌టుడిగా మారాక‌ కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది సూర్య న‌టించిన‌ మోస్ట్ అవైటెడ్ మూవీ కంగువ‌లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దీంతో పాటు క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్ న‌టిస్తున్న కాటేరా అనే పాన్ ఇండియా చిత్రంలోను జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు. ప‌లువురు టాలీవుడ్ స్టార్ల సినిమాల్లోను జ‌గ‌ప‌తి కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం.