300 కోట్ల సినిమా.. 300 రూపాయల టికెట్.. కింగ్ ఎవరు?
ప్రెజెంట్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా తీయడం కష్టం అనుకునేవాళ్లు, కానీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసి జనాల దాకా తీసుకెళ్లడం ఇంకా కష్టంగా మారింది.
By: M Prashanth | 12 Jun 2026 6:00 PM ISTప్రెజెంట్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా తీయడం కష్టం అనుకునేవాళ్లు, కానీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసి జనాల దాకా తీసుకెళ్లడం ఇంకా కష్టంగా మారింది. సోషల్ మీడియా ప్రభావంతో సినిమా టాక్ ను కొందరు కావాలనే మానిప్యులేట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన పెద్ది సినిమా ప్రమోషన్స్ లో సీనియర్ నటుడు జగపతిబాబు ఈ ప్రస్తుత ట్రెండ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆలోచించేలా చేస్తున్నాయి.
ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దాన్ని బతికించుకోవడానికి చిత్రయూనిట్ నానా కష్టాలు పడాల్సి వస్తోంది. సరిగ్గా ఇదే పాయింట్ ను జగపతిబాబు టచ్ చేశారు. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు వచ్చే నెగిటివిటీని తట్టుకుని సినిమా నిలబడటం అంటే ఇప్పుడున్న రోజుల్లో మామూలు విషయం కాదని అన్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాళ్లలో కొందరు కావాలనే స్ప్రెడ్ చేసే నెగిటివిటీ వల్ల అసలైన ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని మేకర్స్ చెబుతున్నారు. జగపతిబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పక్కాగా సినిమాను ఎంజాయ్ చేసే ఆడియన్స్ మూడో రోజు వరకు కూడా థియేటర్స్ వైపు చూడటం లేదని క్లారిటీ ఇచ్చారు. అంటే మొదటి రెండు రోజులు పూర్తిగా సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ దెబ్బకు ఫ్యామిలీ ఆడియన్స్ భయపడిపోయి, అసలు రివ్యూస్ అన్నీ సెటిల్ అయ్యాకే థియేటర్లకు వెళ్దామని డిసైడ్ అవుతున్నారు.
ఇక సినిమా బడ్జెట్, దాన్ని ట్రోల్ చేసే వాళ్ళ గురించి జగ్గూభాయ్ చెప్పిన లాజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నిర్మాతలు ఏకంగా 300 కోట్లు పెట్టి ఒక భారీ సినిమా తీస్తే, కేవలం 300 రూపాయలు పెట్టి టికెట్ కొన్న వ్యక్తి దాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నాడని ఆయన అన్నారు. పైగా ఆ ట్రోల్స్ ద్వారా ఆ వ్యక్తి ఏకంగా 10 నుంచి 20 రెట్లు డబ్బులు సంపాదించుకుంటున్నాడని కూడా ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. మనం ఇప్పుడు అలాంటి ఒక దారుణమైన ఇండస్ట్రీలో బతుకుతున్నామని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఈ మొత్తం గేమ్ లో పవర్ ఎవరి చేతిలో ఉందో చెప్పడానికి ఆయన వాడిన ఇంకో డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన మేకర్స్ కింగ్ కాదు, ఆ 300 రూపాయల టికెట్ కొన్న వాడే అసలైన కింగ్ అని ఆయన తేల్చి చెప్పారు. క్రియేటర్స్ ఎంత కష్టపడి కంటెంట్ ఇచ్చినా, దాన్ని నాశనం చేసే పవర్ ఒక సామాన్య ప్రేక్షకుడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కు వచ్చేసిందని ఈ కామెంట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
పెద్ది సినిమా రిజల్ట్ విషయంలో కూడా ఆయన ముందుగా ఒక రకమైన అభద్రతా భావానికి గురయ్యారట. మొదట్లో ఈ సినిమా తన అంచనాలకు తగ్గట్టుగా రీచ్ కాలేదని తాను కాస్త నిరాశ చెందినట్లు ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అంటే నెగిటివ్ బజ్ అనేది లోపల నటించిన ఆర్టిస్టులను కూడా ఎంతలా ప్రభావితం చేస్తుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో మేకర్స్ పడుతున్న అసలైన ఇబ్బందులను ఆయన తన క్లారిటీతో పర్ఫెక్ట్ గా జనాల ముందు ఉంచారు.
