Begin typing your search above and press return to search.

జ‌గ్గూ భాయ్ కు వింత‌ అనుభ‌వం

తాజాగా జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా సాధార‌ణ వ్య‌క్తిలా జ‌న బాహుల్యంలో చాలా సేపు సంచ‌రించినా ఒక్క‌రూ ఆయ‌న్ను గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   12 April 2025 11:15 AM
జ‌గ్గూ భాయ్ కు వింత‌ అనుభ‌వం
X

కుటుంబ క‌థా చిత్రాల హీరోగా కెరీర్‌ను ప్రారంభించి అభిమానుల నుంచి మ‌న్న‌నలు పొందిన జ‌గ‌ప‌తి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్ర‌తి నాయ‌కుడిగా, ప‌లు సినిమాల్లో హీరోల తండ్రి పాత్ర‌ల్లో, మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క రోల్స్‌లో అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 170కి పైగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల్లో న‌టించిన జ‌గ‌ప‌తి బాబుకు ఇటీవ‌ల ఓ వింత అనుభ‌వం ఎదురైంది.

తాజాగా జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా సాధార‌ణ వ్య‌క్తిలా జ‌న బాహుల్యంలో చాలా సేపు సంచ‌రించినా ఒక్క‌రూ ఆయ‌న్ను గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డం విశేషం. సిమెంట్ రంగు ష‌ర్ట్‌, కాకీ రంగు ఫ్యాంట్ వేసుకుని జ‌గ‌ప‌తి బాబు ప‌లు వీధుల్లో నుంచి ఒక్క‌డే న‌డుచుకుంటూ ఒక మొబైల్ షాప్‌కు వెళ్లాడు. అత‌డి సిబ్బంది ఆయ‌న్ని వీడియో తీస్తూ వెంబ‌డించారు. అయితే, వీడియో తీస్తున్నంత సేపూ ఏ ఒక్క‌రూ జ‌గ‌ప‌తి బాబును గుర్తు ప‌ట్టి ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డం విశేషం.

ఈ మ‌ధ్య‌కాలంలో బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్టిన‌ పుష్ప‌-2 మొద‌లు తాజాగా రిలీజైన బాలీవుడ్ చిత్రం జాట్ వ‌ర‌కు జ‌గ‌ప‌తిబాబు ఏదొక సినిమాలో క‌నిపిస్తూనే ఉన్నారు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌పెద్ది సినిమాలో కూడా జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కేవ‌లం సినిమాల్లోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ జ‌గ్గూ భాయ్ చాలా క్రియాశీల‌కంగా ఉంటాడు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫిట్‌నెస్ వీడియోలు, వ్య‌క్తిగ‌త విష‌యాలు షేర్ చేస్తూ త‌న అభిమానుల‌కు, ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లోనే ఉంటాడు.

ఇటు సినిమాల్లోనూ, అటు సోష‌ల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండే జ‌గ్గూ భాయ్‌ను అభిమానులు, సాధార‌ణ ప‌బ్లిక్ గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డం విశేషం. తెర‌పై క‌నిపించే విధంగా కాకుండా జ‌గ‌ప‌తి బాబు సింపుల్‌గా కామ‌న్‌మ‌న్‌లా వీధుల్లో క‌నిపించేస‌రికి ప్ర‌జ‌లు గుర్తుప‌ట్ట‌లేదు. స్వ‌యంగా జ‌గ‌ప‌తిబాబే షేర్ చేసిన ఈ వీడియో గురించి అభిమానులు ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు సార్ అని కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు.