Begin typing your search above and press return to search.

కేశవ అరెస్టు.. పుష్ప 2 పరిస్థితేంటి?

పుష్ప సినిమాలో కేశవ పాత్రతో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ యువతికి దూరంగా ఉంటూ వచ్చాడు

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:56 AM GMT
కేశవ అరెస్టు.. పుష్ప 2 పరిస్థితేంటి?
X

పుష్ప ఫేమ్ జగదీశ్ ఓ కేసులో అరెస్ట్ కావడం టాలీవుడ్ లో కలకలం రేపింది! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన జగదీశ్.. హీరో స్నేహితుడు కేశవగా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. పుష్ప మూవీ కూడా జగదీశ్ వాయిస్ ఓవర్ తోనే నడుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో జగదీశ్ కు ఆఫర్స్ పెరిగాయి. ఓటీటీలో కూడా పలు ప్రాజెక్ట్ ల్లో నటించాడు. పుష్ప సీక్వెల్ లో కూడా జగదీశ్ నటిస్తున్నాడు.

అయితే అతడిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు తాజాగా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా పుష్ప ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. సినిమా రిలీజ్ ఇంకాస్త రిలీజ్ లేట్ అవుతుందోమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అతడిపై షూట్ చేయాల్సింది చాలా ఉందట. అయితే అతడు బెయిల్ పై వచ్చాక మిగతా షూట్ జరుగుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కానీ మరికొందరు మాత్రం అతడిని రీప్లేస్ చేస్తారని అంటున్నారు. మరి సినిమా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ కొన్నిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇక జగదీష్ కేసు వ్యవహారం వివరాల్లోకి వెళితే.. యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన జగదీశ్‌ను బుధవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన జగదీశ్‌ ప్రస్తుతం రాంగోపాల్‌పేట్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. సినీ అవకాశాలు రాక ముందు లఘుచిత్రాలు తీసేవాడు. ఐదేళ్ల క్రితం వాటిలో నటించే ఓ యువతితో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారింది. అప్పటికే ఆమెకు వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

పుష్ప సినిమాలో కేశవ పాత్రతో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ యువతికి దూరంగా ఉంటూ వచ్చాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. నవంబర్ 27వ తేదీన ఆమె ఇంటికి వెళ్లాడు జగదీశ్. ఆమె మరో వ్యక్తితో కలసి ఉండగా ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.