Begin typing your search above and press return to search.

అప్పుడు సింగిల్ గా.. ఇప్పుడు పిల్లలతో.. 90స్ కిడ్స్ మూవీ టైమ్!

అయితే ఒకప్పుడు పిల్లలుగా సినిమా చూసిన సినీ ప్రియులు, అభిమానులు.. ఇప్పుడు తమ పిల్లలతో థియేటర్స్ కు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 May 2025 9:15 AM
అప్పుడు సింగిల్ గా.. ఇప్పుడు పిల్లలతో.. 90స్ కిడ్స్ మూవీ టైమ్!
X

అప్పుడు తొలిసారి రిలీజ్ అయినప్పుడు సింగిల్ గా థియేటర్స్ కు వెళ్లారు సినీ ప్రియులు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అయినప్పుడు తమ కుటుంబాలు.. ముఖ్యంగా పిల్లలతో థియేటర్స్ కు వెళ్తున్నారు. ఈ అరుదైన సందర్భానికి వేదిక జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్. 35 సంవత్సరాల తర్వాత ఆ మూవీ మళ్లీ విడుదలైన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. స్టార్ నటి శ్రీదేవి హీరోయిన్ గా.. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ అప్పట్లో తెరకెక్కించారు. చక్కటి సోషియో ఫాంటసీ కథతో భారీ విజువల్‌ వండర్‌ లా ముస్తాబైన ఆ సినిమా.. 1990లో సమ్మర్ స్పెషల్ గా మే 9వ తేదీన విడుదలైంది.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు మే9వ తేదీన రీ రిలీజైంది. 2డీతో పాటు 3డీ వెర్షన్‌లో విడుదల చేశారు మేకర్స్. అప్పటి క్లాసిక్ చిత్రం.. త్రీడీ సొబగులద్దుకుని సినీ ప్రియులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. అన్ని వర్గాల ఆడియన్స్ ను థియేటర్స్ ను రప్పిస్తుంది. మంచి వసూళ్లను కూడా రాబడుతోంది.

అయితే ఒకప్పుడు పిల్లలుగా సినిమా చూసిన సినీ ప్రియులు, అభిమానులు.. ఇప్పుడు తమ పిల్లలతో థియేటర్స్ కు వస్తున్నారు. 3డీ వెర్షన్ లో మూవీని తమ పిల్లలకు చూపిస్తూ.. తాము కూడా చూపిస్తూ సందడి చేస్తున్నారు. దీంతో సినిమా రీ రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఫ్యామిలీసే ఎక్కువగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అబ్బనీ తీయని దెబ్బ వంటి పాటల సమయంలో ఆడియన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. స్పెషల్ డ్రెస్సులు.. స్టెప్పులు.. కేరింతలతో హోరెత్తిస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 90స్ క్లాసిక్ మూవీ మరోసారి త్రీడీలో చూడడం చాలా ఆనందంగా ఉందని అంతా చెబుతున్నారు.

అయితే కొంత మంది ప్రేక్షకులు ప్రింట్ నాణ్యత గురించి ఇచ్చిన చిన్న ఫిర్యాదులను గమనించినప్పటికీ.. ఓవరాల్ గా రీ రిలీజ్ ట్రెండ్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి మాత్రం ల్యాండ్ మార్క్ గా నిలిచిందనే చెప్పాలి. అటు రెస్పాన్స్.. ఇటు కలెక్షన్స్.. రెండూ భారీగానే ఉండడం విశేషం. దీంతో 90ల నాటి క్లాసిక్‌ లపై రీ రిలీజ్ లపై పలువురు మేకర్స్ ఫోకస్ చేసినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.