Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. ఈ ఓపెనింగ్స్ ఏంటీ జాక్?

టిల్లు స్క్వేర్ సినిమాతో స్టార్ రేంజ్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ, అదే ఊపును కొనసాగించాలనే ఉద్దేశంతో 'జాక్' అనే సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   11 April 2025 11:31 AM IST
బాక్సాఫీస్.. ఈ ఓపెనింగ్స్ ఏంటీ జాక్?
X

టిల్లు స్క్వేర్ సినిమాతో స్టార్ రేంజ్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ, అదే ఊపును కొనసాగించాలనే ఉద్దేశంతో 'జాక్' అనే సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ మీద మొదట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజ్ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. టీజర్, సాంగ్స్‌పై స్పందన పాసిటివ్‌గా ఉన్నప్పటికీ, ట్రైలర్ మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదన్న టాక్ వచ్చింది.

అదే ఇప్పుడు ఓపెనింగ్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసినట్టు స్పష్టమవుతోంది. ఏప్రిల్ 10న విడుదలైన జాక్ మూవీ, తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇదే సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ తొలి రోజు కలెక్షన్ రూ.11.07 కోట్లతో పోలిస్తే ఇది వందశాతం డిజాస్టర్ రేంజ్. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లన్నీ కలిపి శాతం 10% కూడా రాలేదన్నదే వాస్తవం.

ఇదిలా ఉండగా తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మాత్రం తొలి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. తమిళనాడులో ఉదయం 73%, మద్యాహ్నానికి 81% వరకు ఆక్యుపెన్సీ నమోదు కాగా, సాయంత్రానికి 75% స్థాయిలో నిలిచింది. ఈ సినిమాకు తొలి రోజు ₹28–30 కోట్లు నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో తెలుగులో మాత్రం దీనికి ఓ మోస్తరు స్పందన రావడం గమనార్హం.

హిందీలో సన్నీ డియోల్ నటించిన 'జాట్' అనే చిత్రం విడుదలైన తొలి రోజే రూ.10–12 కోట్లు వసూలు చేసినప్పటికీ, ఇది గదర్ 2 లెవెల్‌కు పోల్చుకుంటే కేవలం 30 శాతమే. నాస్టాల్జియా ఒక్కటే సినిమాకు హిట్టు ఇవ్వలేదన్న మరో సాక్ష్యం ఇది. కొత్త జనరేషన్‌కి కనెక్ట్ అవ్వడంలో జాట్ విఫలమైందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జాక్ సినిమా విషయంలో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించినప్పటికీ, సినిమాకు సరైన ప్రీ రిలీజ్ హైప్ దక్కలేదు. నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ అంచనాలతో నిర్మించినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం తీవ్రంగా నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇక సినిమా గురించి పబ్లిక్ టాక్ కూడా చాలా బలహీనంగా ఉండటంతో, ఈ వారం చివరికి టోటల్ క్లోజింగ్‌కు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు ఆశలన్నీ సిద్ధూ నటిస్తున్న మరో సినిమా ‘తెలుసుకదా’పైనే ఉన్నాయి. ఈ ఏడాది మరోసారి హిట్ కొట్టాలంటే ఆ సినిమాపైనే డిపెండ్ కావాల్సిన పరిస్థితి. టిల్లు ఫ్రాంచైజ్ లాంటి బ్రాండ్ వర్కవుట్ అవ్వకపోతే, స్టార్ హీరోగా సత్తా నిరూపించుకోవడం కష్టమవుతుంది. మరి సిద్ధూ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.