Begin typing your search above and press return to search.

స్కూల్స్‌ కాలేజ్‌ల‌కు 'ఐట‌మ్ నంబ‌ర్‌' క‌ల్చ‌ర్ దిగుమ‌తి!

ఇటీవ‌ల ఓ స్కూల్ వార్షికోత్స‌వంలో 10వ త‌ర‌గతి లోపు స్కూల్ పిల్ల‌లు బాత్ ట‌వల్ విప్ప‌దీస్తూ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శించిన వీడియో వెబ్ లో అంద‌రినీ నివ్వెర‌ప‌రిచింది.

By:  Sivaji Kontham   |   31 March 2026 10:00 AM IST
స్కూల్స్‌ కాలేజ్‌ల‌కు ఐట‌మ్ నంబ‌ర్‌ క‌ల్చ‌ర్ దిగుమ‌తి!
X

క్రీడ‌లు, స్టేజీ నాట‌కాలు, ఇత‌ర‌ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో విద్యార్థుల‌లో మానసిక ఒత్తిళ్ల‌ను త‌గ్గించేందుకు ఏదైనా త‌రుణోపాయం ఆలోచిస్తే దానిని ప్ర‌శంసించ‌ని వారు ఉంటారా? కానీ అందుకు భిన్నంగా ఐట‌మ్ నంబ‌ర్ల‌తో, హీరోయిన్ల గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌తో విద్యార్థులకు ట్రీట్ ఇవ్వాల‌ని స్కూల్- కాలేజ్ యాజ‌మాన్యాలు ప్ర‌య‌త్నించ‌డం స‌రైన‌దేనా?

ఇటీవ‌ల ఓ స్కూల్ వార్షికోత్స‌వంలో 10వ త‌ర‌గతి లోపు స్కూల్ పిల్ల‌లు బాత్ ట‌వల్ విప్ప‌దీస్తూ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శించిన వీడియో వెబ్ లో అంద‌రినీ నివ్వెర‌ప‌రిచింది. ఇది ఒక స్కూల్ యాన్యువ‌ల్ డే సంస్కృతి.. ! అంటూ అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. విద్యార్థుల‌కు నేర్పాల్సిన పాఠాలు ఇవేనా? స్కూల్ కాలేజ్ ల‌లో ఐట‌మ్ నంబ‌ర్ల‌తో ఈ ట్రీటేంటి? అంటూ ప్ర‌పంచ‌మంతా విస్తుపోయింది..

ఇప్పుడు కాలేజ్ ప్రాంగ‌ణాల‌లో శ్రీ‌య‌, స‌యేషా సైగ‌ల్ వంటి పాపుల‌ర్ తార‌ల‌ నృత్యాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భావి భార‌త పౌరుల‌ను త‌యారు చేస్తున్న కాలేజ్ ల‌లో అందాల క‌థానాయిక‌ల‌తో ఐట‌మ్ నంబ‌ర్ల ట్రీట్ ప్లాన్ చేస్తారా? అంటూ ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు తూర్పార‌బ‌డుతున్నారు. ఇలాంటి క‌ల్చ‌ర్ ని కాలేజ్ లు అడాప్ట్ చేసుకోవ‌డం సిగ్గు చేటుగా ఉందంటూ అంత‌ర్జాలంలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా స్టేజ్ ఎక్కిన త‌ర్వాత స‌యేషా సైగ‌ల్ చిట్టి పొట్టి నిక్క‌రులో `ఉయ్ అమ్మా..` అంటూ చేసిన డ్యాన్సులు ఇంట‌ర్నెట్ లో గుబులు పుట్టిస్తున్నాయి. కాలేజ్ పిల్ల‌ల ముందు అర‌కొర దుస్తుల‌తో ఐట‌మ్ నంబ‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తారా? పిల్ల‌ల‌కు ఏం నేర్పించ‌ద‌లిచారు? అంటూ కామెంట్లు వెబ్ ని వేడెక్కించాయి. శ్రీ‌య కాస్త‌యినా ప‌ద్ధ‌తైన దుస్తుల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది కానీ, స‌యేషా సైగ‌ల్ ఈ విష‌యంలో అస్స‌లు రాజీకి రాలేదు. ప్ర‌స్తుతం స‌యేషా పొట్టి నిక్క‌రు డ్యాన్సులు, శ్రీ‌య హుషారెత్తించే ఊప్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వెబ్ లో హీటెక్కిస్తున్నాయి. ఆస‌క్తిక‌రంగా ఈ ఇద్ద‌రు భామ‌లకు ఇప్ప‌టికే పెళ్ల‌యి కిడ్స్ కూడా ఉన్నారు. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల్లేక ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే.

అయితే కాలేజ్ లు పెరిగిన‌ పోటీ వాతావ‌ర‌ణం కార‌ణంగా ఇలా తార‌ల‌తో త‌మ‌ను తాము ప్ర‌మోట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కానీ ఇలాంటి తుచ్ఛ‌మైన‌ ఐట‌మ్ నంబ‌ర్ల క‌ల్చ‌ర్ చూసాక పేరెంట్ అక్క‌డ త‌మ పిల్ల‌లు చ‌ద‌వాలా వ‌ద్దా? అనేది నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంది. ఫ‌లానా కాలేజ్ లో ఐట‌మ్ క‌ల్చ‌ర్ ఉన్న‌ప్పుడు అక్క‌డే త‌మ పిల్ల‌లు ఎందుకు చ‌ద‌వాలి? వేద మంత్రోచ్ఛార‌ణ‌ల‌తో భ‌క్తి భావ‌జాలాన్ని మొక్కై ఉన్న‌ప్పుడే పిల్ల‌ల‌కు నేర్పించాల‌ని భార‌త‌దేశ పురాత‌న ఆశ్ర‌మ విద్యావిధానం నేర్పింది. దాని స్థానంలో ఇప్పుడు న‌వ‌భార‌త పాఠ‌శాలలు, కాలేజ్ లు ఐట‌మ్ నంబ‌ర్ల క‌ల్చ‌ర్ ని అల‌వాటు చేయ‌డం శోచ‌నీయం అని ఒక సెక్ష‌న్ వాదిస్తోంది. అయితే కాలేజ్ స్కూల్ లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు అంటే రిలీఫ్ కోసం క‌దా! అని లాజిక్కులు వెతికే వాళ్లకు కొద‌వేమీలేదు.

అబ్ధుల్ క‌లాం, సునీత విలియ‌మ్స్ వంటి ప్ర‌ముఖులను కొన్ని దిగ్గ‌జ కాలేజ్ లు త‌మ వార్షికోత్స‌వం కోసం ఆహ్వానించిన గొప్ప‌త‌నం మ‌న‌కు తెలుసు. కానీ ఇప్పుడు గ్లామ‌ర్ డాళ్స్ ని పిలిచి విద్యావ్య‌వ‌స్థ‌ను అవ‌హేళ‌న చేయాల‌నుకోవ‌డం శోచ‌నీయం. స్కూల్, కాలేజ్ ల‌లో ఐటమ్ నంబ‌ర్ల క‌ల్చ‌ర్ ని ఇలా విచ్ఛ‌ల‌విడిగా అల‌వాటు చేస్తే అది ఏ తీరానికి చేరుస్తుందో ఎవ‌రైనా సులువుగా గ్ర‌హించ‌గ‌ల‌రు!

చాప కింద నీరులా...!

తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజ్ ల‌కు కొన్ని దుష్ఠ శ‌క్తులు ఇప్ప‌టికే గంజాయి, డ్రగ్స్ క‌ల్చ‌ర్ ని అల‌వాటు చేసాయ‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లున్నాయి. అన్నిచోట్ల‌కు డ్ర‌గ్స్ చాప కింద నీరులా పాకిపోతోంది. ఈ స్కూల్స్ కాలేజ్ ల‌ను న‌డిపించే బ‌డా బాబులు రాజ‌కీయ రంగంలో ఉన్న‌వారే కావడం ఇక్క‌డ విశేషం. ఇప్పుడు ఐట‌మ్ నంబ‌ర్ క‌ల్చ‌ర్ కూడా అద‌నంగా తోడైంది. మునుముందు ఇంకేదైనా గొప్ప పాశ్చాత్య క‌ల్చ‌ర్‌ని మ‌న‌వాళ్లు అడాప్ట్ చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు.