ఆర్య ఇంట్లో ఐడీ రైడ్స్ వెనుక అసలు కారణమదేనా?
కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో బుధవారం ఉదయం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
By: Tupaki Desk | 18 Jun 2025 3:24 PM ISTకోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో బుధవారం ఉదయం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆర్య ఇంట్లోనే కాకుండా ఆయనకు సంబంధించిన సీ షెల్ రెస్టారెంట్ బ్రాంచ్‌ల్లో కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. అన్నా నగర్, వేలచ్చేరి సహా చెన్నైలోని పలు సీ షెల్ బ్రాంచ్‌ల్లో ఈ దాడులు జరిగాయి.
ఉదయం 8 గంటలకే ఐటీ అధికారులు అన్నా నగర్ సీ షెల్ రెస్టారెంట్ కు వెళ్లి తనిఖీలు ప్రారంభించినట్టు సమాచారం. పోలీసుల బందోబస్తుతో వారు ఈ సోదాలు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ఈ విషయం చెన్నైలోని సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్యాక్స్ ఎగవేత నేపథ్యంలోనే ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా వారు రెస్టారెంట్ కు సంబంధించిన లావాదేవీలపైనే దృష్టి సారించినట్టు సమాచారం.
ఆర్య గతంలో సీ షెల్ అనే అరేబియన్ రెస్టారెంట్స్ చైన్ ను స్టార్ట్ చేయగా, తర్వాత కొన్నాళ్లకే దాన్ని కేరళకు చెందిన కున్హి మూసా అనే బిజినెస్ మ్యాన్ కు అమ్మేసినట్టు వార్తలొచ్చాయి. ఆల్రెడీ కేరళలో కున్హి మూసాకు సంబంధించిన ఆస్తులపై ఐటీ శాఖ నిఘా పెట్టిందని, ఆ విచారణలో భాగంగానే చెన్నైలోని రెస్టారెంట్లు, ఆర్య ఇంటిపై దాడులు చేశారని అంటున్నారు.
ఆర్య తన రెస్టారెంట్స్ ను అమ్మేసినప్పటికీ, ఇంకా ఆర్యకు వాటితో ఏమైనా సంబంధముందా అనే కోణంలో ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారట. కాగా తనకు సీ షెల్ రెస్టారెంట్లతో ఎలాంటి సంబంధం లేదని ఆర్య అక్కడి లోకల్ మీడియాకు చెప్పినట్టు తెలుస్తోంది. ఐటీ రైడ్స్ మొత్తం పూర్తయ్యాక అధికారులు దీనికి సంబంధించిన సమాచారాన్ని రిలీజ్ చేసే అవకాశముంది.
