Begin typing your search above and press return to search.

'వీరమల్లు' రూమర్స్ కు చెక్ పడినట్లేనా?

ఈ నేపథ్యంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 1:30 PM GMT
వీరమల్లు రూమర్స్ కు చెక్ పడినట్లేనా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ "హరి హర వీరమల్లు". గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో, ఫిలిం సర్కిల్స్ లో అనేక రూమర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తప్పుకున్నారనే పుకారు బాగా చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. అయితే ఈ అప్డేట్ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టగపోగా, మరిన్ని సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది.

'హరి హర వీరమల్లు' సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఇరాన్, కెనడా దేశాల్లో జరుగుతోందని చిత్ర యూనిట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమా మీ ఊహకు మించి ఉంటుందని, మిమ్మల్ని సీటు అంచున కూర్చో బెట్టే థ్రిల్లింగ్ ప్రోమో ఒకటి త్వరలో రాబోతోందని తెలిపారు. ఇదంతా బాగానే వుంది కానీ.. అసలు ఈ సినిమా ఏ పుకార్ల వల్ల వార్తల్లో నిలచిందో, వాటిపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.

'వకీల్ సాబ్' తర్వాతి సినిమాగా 'హరి హర వీరమల్లు' సెట్స్ మీదకు వెళ్ళింది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ కమిటైన ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రేక్షకుల ముందుకి వచ్చేశాయి. కానీ ఇది మాత్రం ఇంకా లేట్ అవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను పక్కనపెట్టి, అనుష్కతో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఒట్టి రూమర్స్ అని గానీ, అవాస్తవమని గానీ వీరమల్లు టీమ్ తమ ప్రకటనలో ఖండించలేదు.

నిర్మాత ఏఎం రత్నం ఆ మధ్య ఓ సందర్భంలో 'హరి హర వీరమల్లు' గురించి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల లోపే సినిమాని విడుదల చేస్తామని అన్నారు. కానీ అలా జరగడం లేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అసలు ఇప్పట్లో వస్తుందా రాదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి తాజా ప్రకటనలో ఈ విషయాలపై చిత్ర బృందం స్పష్టత ఉచ్చుంటే బాగుండేదని కొందరు పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే 'హరి హర వీరమల్లు' టీమ్ ప్రకటనలో చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో క్రిష్ ను ట్యాగ్ చేయడం ద్వారా రూమర్స్ కు చెక్ పెట్టినట్లుగా భావించవచ్చని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇది భారీ స్థాయిలో రూపొందే పీరియాడిక్ మూవీ కనుకే, కచ్చితమైన తేదీలను మేకర్స్ చెప్పలేకపోతున్నారని అంటున్నారు. త్వరలో రాబోయే స్పెషల్ ప్రోమోతో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.

17వ శతాబ్దంలోని చారిత్రక కథాంశంతో 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ వీరోచిత బందిపోటుగా కనిపించారు. ఈ సినిమా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.