Begin typing your search above and press return to search.

పబ్లిక్ టాక్: 'సిద్దార్థ్ రాయ్' మెప్పించాడా?

హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసిన యశస్వీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 10:34 AM GMT
పబ్లిక్ టాక్: సిద్దార్థ్ రాయ్ మెప్పించాడా?
X

టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమైన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసిన యశస్వీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రమోషనల్ కంటెంట్ తో 'అర్జున్ రెడ్డి 2.0' అనే కామెంట్స్ రావడం.. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ చూసి దర్శకుడికి తన బ్యానర్ లో నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వడంతో.. అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు(ఫిబ్రవరి 23) థియేటర్లోకి వచ్చేసింది.

కథేంటంటే.. 12 ఏళ్లకే ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివేసిన సిద్ధార్థ్ (దీపక్ సరోజ్).. ఎమోషన్స్ ఏమీ లేకుండా, లాజిక్స్ మీద బ్రతుకుతుంటాడు. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటాడు.. ఆకలి వేస్తే ఆకులు తినడానికి కూడా సిద్ధపడతాడు. కోరికలు కలిగితే అమ్మాయిలను ఒప్పించి అవసరాలు తీర్చుకుంటాడు. అలా సాగిపోతున్న అతని లైఫ్ లోకి ఇందు (తన్వి నేగి) ప్రవేశిస్తుంది. కేవలం లాజిక్స్ మాత్రమే ఫాలో అయ్యే అతను, ఇందు ప్రేమలో ఎలా పడతాడు? ఆమె నుండి ఏం నేర్చుకున్నాడు? వారి మధ్య సంఘర్షణ ఏంటి? ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి? అతని జీవితంలో రాధ (నందిని యల్లారెడ్డి) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే 'సిద్ధార్థ్ రాయ్' సినిమా చూడాల్సిందే.

డైరెక్టర్ యశస్వీ ఎంపిక చేసుకున్న పాయింట్, చెప్పాలనుకున్న కథ.. ఐడియా పరంగా బాగానే ఉన్నా, సినిమాగా తెరపైకి తీసుకురావడంలో తడబడ్డారనే టాక్ వినిపిస్తోంది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారినట్లుగా, ఇందులో హీరో పాత్రను తీర్చిదిద్దినట్లు చూపించే ప్రయత్నం చేశారు. సిద్ధార్థ్‌ రాయ్ యొక్క ఎదుగుదల, పతనం, రియలైజేషన్ యొక్క ఎమోషనల్ సాగాని చూపించాలని అనుకున్నారు. అయితే ఎమోషన్స్ కి, లాజిక్స్ కి మధ్య నలిగే వ్యక్తిగా హీరోని చూపించే క్రమంలో.. మోతాదుకు మించి డ్రామా, అవసరానికి మించి బోల్డ్ సీన్స్ పెట్టారని తెలుస్తోంది.

ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాపై సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' ప్రభావం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దాంతో పాటుగా 'యానిమల్', 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' లాంటి సినిమాలు గుర్తు చేసేలా హీరో క్యారెక్టరైజేషన్ ఉందని అంటున్నారు. అయితే ఎమోషనల్ క్యారెక్టర్ ను ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా, అర్థమయ్యేలా తీయడంలో.. కథలో ఎమోషన్స్ ను పండించడంలో దర్శకుడు ఫెయిల్ అయినట్లుగా సమీక్షలు చెబుతున్నాయి. కొన్ని సీన్స్ లో మాత్రమే ప్రతిభ చూపించారని టాక్.

హీరో లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో పాత్రని గుర్తుకు తెస్తాయి. ప్రతీ సీన్ లోనూ హీరో పాత్రని బలవంతంగా ఎలివేట్ చేసే ప్రయత్నమే జరిగింది. ఇక బూతులు, రొమాన్స్, అంతకుమించిన బోల్డ్ సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే చెప్పాలనుకున్న ఎమోషన్ కంటే బోల్డ్ సీన్లు హైలైట్ అయ్యాయనే టాక్ వచ్చింది. అయితే డైరెక్టర్ చెప్పాలనుకున్న సందేశం ఏంటనేది సాధారణ ప్రేక్షకుడికి అర్థం కాకపోయినా.. బోల్డ్ నెస్ ను ఇష్టపడే ఓ వర్గం ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండొచ్చని అంటున్నారు.

హీరోగా తొలి సినిమా అయినప్పటికీ, దీపక్ సరోజ్ పెర్ఫార్మన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్ లో లుక్స్ అంతగా బాగాలేవు. చైల్డ్ ఆర్టిస్టుకి మీసాలు పెట్టినట్లు ఉందనే కామెంట్లు వస్తున్నాయి. హీరోయిన్ తన్వి నేగి నిర్మొహమాటంగా బోల్డ్ సీన్లు చేసింది. ఒక సాంగ్ మినహా రధన్ ఇచ్చిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ ఇంకా బెటర్ గా ఉండాల్సిందని, కథ అవసరం మేరకు నిర్మాణ విలువలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా, 'అర్జున్ రెడ్డి' సినిమాతో అసలు పోలిక పెట్టకుండా, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆశించకుండా వెళ్తే.. 'సిద్ధార్థ్ రాయ్' ఈ జనరేషన్ ఆడియెన్స్ ను కొంత మేరకు ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.