మెట్ గాలా 2025: సిసలైన షో స్టాపర్ ఇషా అంబానీ
న్యూయార్క్ లో మెట్ గాలా 2025 ఫ్యాషన్ ఈవెంట్ కు భారతదేశం నుంచి ప్రముఖ నటీనటులు హాజరైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 5:39 PM ISTన్యూయార్క్ లో మెట్ గాలా 2025 ఫ్యాషన్ ఈవెంట్ కు భారతదేశం నుంచి ప్రముఖ నటీనటులు హాజరైన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా , కియారా అద్వానీ సహా పలువురు భారతీయ సినీదిగ్గజాలు మెట్ గాలా ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ ఫ్యాషన్, ప్రతిభను సగర్వంగా ప్రదర్శించారు వీరంతా.
అయితే ఇదే ఈవెంట్లో ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ప్రదర్శన షో స్టాపర్ గా నిలిచింది. బాలీవుడ్ కథానాయికలను తలదన్నే స్టైల్ లో ఇషా అంబానీ ఇచ్చిన ఫోజులు, స్టైల్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓషన్స్ 8లో హాలీవుడ్ నటి అన్నా హత్వే ధరించిన వజ్రాల హారాన్ని పోలి ఉన్న హారాన్ని ధరించి ఇషా
టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రపంచంలోని ప్రజల కళ్లన్నీ ఆ వజ్రాల హారంపైనే! ఇషా ధరించిన హారము, అన్నా ధరించిన హారమూ రెండూ ఒకేలా కనిపించడంతో అహూతుల కళ్లు చెదిరిపోయాయి. కానీ దీనిని నిశితంగా పరిశీలిస్తే.. వజ్రాల పరిమాణం, సంఖ్యలో తేడాలు ఉన్నాయని గ్రహించారు. ఆసక్తికరంగా, ఈ రెండు ఐకానిక్ హారములను డిజైన్ చేసిన పాపులర్ ఆభరణాల వ్యాపారి జాక్వెస్ కార్టియర్ ఒరిజినల్ హారం నుంచి ప్రేరణ పొందాయి. ప్రపంచంలోని అత్యంత అందమైన ఆభరణాలు నవానగర్ మహారాజా వద్ద ఉన్నాయి. అతడి కోసం ఈ వజ్రాల హారం డిజైన్ 1931లో రూపొందించారు. ఆ అసలు హారము 1960 వరకు రాజ కుటుంబంలోనే ఉంది. ఆ తర్వాత కార్టియర్ దానిని తిరిగి కొనుగోలు చేశాడు. కాలక్రమేణా ప్రధాన వజ్రాన్ని తిరిగి కట్ చేసి, ఆ ముక్క నుండి ఇతర వజ్రాలను వేర్వేరు ప్రదేశాలలో కలెక్టర్లకు పంపి వేలం వేసారు. ఫలితంగా అసలు హారము దాని పూర్తి రూపాన్ని కోల్పోయింది.
అయితే ఓషన్స్ 8 సినిమా కోసం కార్టియర్ ఆర్కైవల్ ఫోటోలను ఉపయోగించి నెక్లెస్‌ను తిరిగి సృష్టించారు. ఒరిజినల్ హారం మగవారి కోసం తయారు చేసారు కనుక.. నెక్లెస్ పరిమాణాన్ని 20 శాతం వరకూ తగ్గించారు. ఆ తర్వాత అది నటి అన్నే హాత్వేకు సరిపోయింది. నిజానికి తిరిగి పునఃసృష్టించిన వజ్రాల హారం విలువ దాదాపు 150 మిలియన్ల అమెరికన్ డాలర్లు. దీనిని బట్టి ఒరిజినల్ హారం ఖరీదు ఎంత ఉంటుందో ఊహించవచ్చు.
నిజానికి మెట్ గాలాలో ఇషా అంబానీ తాను ధరించిన నెక్లెస్ వాస్తవానికి తన తల్లి నీతా అంబానీకి చెందినదని వెల్లడించింది. అంబానీలు కూడా రాయల్ కార్టియర్ డిజైన్ నుండి ప్రేరణ పొంది, ఆ కాలాతీత శైలిని ప్రతిబింబించేలా కస్టమ్ పీస్‌ను తయారు చేయించారట. ఈ సంవత్సరం మెట్ గాలాలో ఇషా ఐదవసారి కనిపించింది. ఆమె భారతీయ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించిన దుస్తులను ధరించింది. అనైతా ష్రాఫ్ అడజానియా ఈ లుక్ కి స్టైలింగ్ చేసారు.
